జాతీయ జట్టులో ఆడటం కంటే ముందు విదేశాల్లో ఏ-జట్టు తరఫున ఆడటం కలిసొచ్చిందని టీమ్ఇండియా పేసర్ శార్దుల్ ఠాకూర్ చెప్పాడు. ఆసీస్‌తో నాలుగో టెస్టు తొలి టెస్టులో సుందర్‌తో బాగా సమన్వయం చేసుకుని బ్యాటింగ్ చేయడం వల్లే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకురాగలిగామని అన్నాడు.
"భారత్ ఏ-జట్టులో ఆడితే మంచి అనుభవం వస్తుంది. 2016లో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితులు అర్థమయ్యాయి. ప్రస్తుతం సీనియర్లతో కలిసి ఆడుతున్నప్పుడు ఆ అనుభవం ఉపయోగపడింది. అవసరం వస్తుందనే నెట్స్‌లో బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. ఎక్కువ సేపు క్రీజులో ఉంటే జట్టుకు మేలు జరుగుతుందని తెలుసు. ఈ సమయంలో సఫలం కావాలనే కసితో నేనూ, సుందర్ ఆడాం. అతడితో ఇదివరకు ఎప్పుడూ బ్యాటింగ్ చేయలేదు. కానీ ఇద్దరం బాగా మాట్లాడుకుంటూ, క్రీజులో ఎక్కువ సేపు ఉండి ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నించాం"
-శార్దుల్ ఠాకూర్, భారత పేసర్
ఈ మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమ్ఇండియా 336 పరుగులకు ఆలౌటైంది. టాప్ ఆర్డర్ విఫలమవగా శార్దుల్(67), సుందర్(62) హాఫ్ సెంచరీలు చేసి, జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.
"పరుగుల కోసం ఎక్కువగా మేం ప్రయత్నించలేదు. అవకాశం ఉన్నప్పుడు మాత్రమే షాట్లు ఆడాం. ఇంత సదీర్ఘ పర్యటనలో చివరి వరకు ఆత్మస్థైర్యంతో ఉండటం సవాలే. కానీ, నిర్ణయాత్మక మ్యాచ్‌లో 1-1తో ఇరుజట్లు సమంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రేరణ అవసరం లేదు. జట్టు కోసం 100 శాతం కష్టపడాల్సిందే"
-శార్దుల్ ఠాకూర్, భారత పేసర్
మదిలో రవిశాస్త్రి మాటలే..
"ఆసీస్ క్రికెటర్లు స్లెడ్జింగ్‌కు చేసినా, పట్టించుకోకుండా నా ఆట నేను ఆడాను. క్రీజులోకి వచ్చేసరికే జట్టు పరిస్థితి బాగాలేదు. ప్రేక్షకులు ఆసీస్ గెలవాలని అరుస్తున్నారు. అప్పటికే ప్రత్యర్థిదే పైచేయి. కోచ్ రవిశాస్త్రి చెప్పిన మాటలు అప్పుడు నాకు గుర్తొచ్చాయి. 'ఇక్కడ నువ్వు బాగా ఆడితే.. తగిన ప్రతిఫలం దక్కుతుంది. ప్రజలు నిన్ను ప్రేమిస్తారు' అని సిరీస్ ప్రారంభానికి ముందు రవిశాస్త్రి తనతో అన్నారు. 'నేను బాగా ఆడితే జట్టుకు ఉపయోగపడుతుంది. ప్రజలు నన్ను అభిమానిస్తారు' అంతే.. అది దృష్టిలో పెట్టుకొనే ఆడాను" అని శార్దుల్ చెప్పాడు.
ఇదీ చూడండి: సుందర్, ఠాకూర్‌పై ప్రశంసల వెల్లువ