టీమ్‌ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ వాళ్లను ఎక్కడా వదలట్లేదని.. అటు మైదానంలో, ఇటు మీడియా సమావేశంలో నోరు మెదపనీయడం లేదని మాజీ బ్యాట్స్‌మన్ వసీమ్ జాఫర్ సరదాగా చురకలంటించాడు. మొతేరా వేదికగా జరిగిన మూడో (డే/నైట్) టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో కోహ్లీసేన సిరీస్‌లో 2-1తేడాతో ఆధిక్యం సాధించింది. ఈ నేపథ్యంలోనే మొతేరా పిచ్‌పై పలువురు మాజీ ఆటగాళ్లతో పాటు బ్రిటిష్ మీడియా కూడా విమర్శలు చేస్తోంది. అది స్పిన్‌కు అనుకూలించే పిచ్ అని, టెస్టు క్రికెట్‌కు ఇలాంటి వికెట్‌ను తయారు చేయొద్దని అన్నారు.
ఈ క్రమంలోనే శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఓ బ్రిటిష్ జర్నలిస్టు.. అశ్విన్‌ను ఆ పిచ్ గురించి మాట్లాడి కోపం తెప్పించాడు. మూడో టెస్టుకు తయారు చేసిన వికెట్ మంచిదేనా అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన టీమ్‌ఇండియా స్పిన్నర్.. అసలు మంచి పిచ్ అంటే ఏమిటి? అని నిలదీశాడు. దాంతో ఆ బ్రిటిష్ జర్నలిస్టు కంగుతిని.. 'నేనే మిమ్మల్ని ఆ ప్రశ్న వేస్తున్నా.. టెస్టు మ్యాచ్ అంటే బ్యాట్స్‌మెన్, బౌలర్ల మధ్య ఆధిపత్య పోరు' అని చెప్పుకొచ్చాడు. దీనికి మళ్లీ జవాబిచ్చిన అశ్విన్.. 'మంచి పిచ్ అంటే ఏమిటి?దాన్ని ఎవరు నిర్వచిస్తారు. తొలిరోజు పేస్ బౌలర్లకు సహకరించి, తర్వాత బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించి.. ఆపై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తే అది మంచి వికెటా? ఇలాంటి వాటి నుంచి బయటకు రండి. పిచ్ గురించి రాద్దాంతం అనవసరం' అని సూటిగా తనదైనశైలిలో తేల్చి చెప్పాడు.
'ఇంగ్లాండ్ ఆటగాళ్ల నుంచి పిచ్‌పై ఎలాంటి ఫిర్యాదుల్లేవు. వాళ్లు ఇక్కడి పిచ్‌లపై మెరుగవ్వాలనుకుంటున్నారు. బయటి వాళ్లే ఈ పిచ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మేం ఏ పర్యటనలోనూ పిచ్ గురించి ఫిర్యాదులు చేయలేదు' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక చివరి టెస్టుకు సమతూకం ఉన్న పిచ్ ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు.. దాని గురించి తమకు తెలియదని, టీమ్‌ఇండియా మంచి క్రికెట్ మ్యాచ్ కోసం చూస్తోందని ఈ స్పిన్ వీరుడు పేర్కొన్నాడు. మన గురించి అవతలి వారు ఏమనుకుంటారనే విషయం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. కాగా, ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన వసీమ్.. అశ్విన్ ఇంగ్లాండ్ వికెట్లను ఎక్కడా వదలట్లేదని సరదాగా ట్రోల్ చేశాడు.
ఇదీ చూడండి: డేనైట్ టెస్టుల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన!