మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి ఎదుర్కొన్న సమయంలో టీమిండియా జట్టు క్రీడాకారిణులు కంటతడి పెట్టుకున్నారు. అయితే ఈ పరాజయం తర్వాత ఓపెనర్ షెఫాలీ వర్మ బాధపడిన తీరుపై ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్లీ స్పందించాడు.
"ఫైనల్ మ్యాచ్ ఓటమిని తట్టుకోలేక షెఫాలీ వర్మ బాధపడిన తీరు నన్ను కదిలించింది. కానీ, ఈ టోర్నీలో ఆమె ప్రదర్శన అత్యుత్తమంగా ఉన్నందుకు గర్వపడాలి. ఈ పరాజయంతో భవిష్యత్లో ఒత్తిడిని జయించగలిగే శక్తి తనకు వస్తుంది. అతి చిన్న వయసులో ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. రాబోయే రోజుల్లో ధైర్యంగా ముందుకు వెళ్లడానికి ఇది ఒక అనుభవంలా ఉపయోగపడుతుంది."
- బ్రెట్ లీ, ఆస్ట్రేలియా మాజీ బౌలర్
తుదిపోరులో ఆసీస్ మహిళల ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు బ్రెట్ లీ. 2003లో జరిగిన పురుషుల ప్రపంచకప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇలానే పోటీపడ్డాయని తెలిపాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ అప్పటి రోజులను గుర్తుచేసిందని అన్నాడు.
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఐదోసారి విజేతగా నిలిచింది. జట్టు సమష్టిగా రాణించడం వల్ల ఆసీస్ 85 పరుగుల తేడాతో గెలిచింది. కంగారూ జట్టు ఇచ్చిన 185 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 99 రన్స్కే పరిమితమైంది మహిళా టీమిండియా.
ఇదీ చూడండి.. మొన్న రోహిత్.. నిన్న జైస్వాల్.. నేడు షెఫాలీ