తొడ గాయం కారణంగా మరో తొమ్మిది నెలలు క్రికెట్‌కు దూరమవుతానని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. గత నవంబర్‌లో భారత్‌తో వన్డే సందర్భంగా గాయపడ్డ వార్నర్.. తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. చివరి రెండు టెస్టులు ఆడినప్పటికీ.. అంతా సౌకర్యవంతంగా కనిపించలేదు.
"పరుగు తీసేటప్పుడు తొడలో నొప్పి వస్తుంది. ఇంకొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. ఆరు నుంచి తొమ్మిది నెలలు ఆటకు దూరంగా ఉండాలని సూచించారు. కానీ, వీలైనంత త్వరగా నా గాయాన్ని వైద్యులు నయం చేస్తారనే నమ్మకం నాకుంది."
-డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా క్రికెటర్.
వార్నర్ తన గాయం గురించి బహిరంగంగానే చెప్తున్నప్పటికీ.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే స్క్వాడ్‌లో ఇంకా అతని పేరు ఉంది. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ జట్టుకు డేవిడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. వార్నర్ తాజా నిర్ణయంతో రానున్న ఐపీఎల్‌కు అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే యాషెస్ సిరీస్ నాటికి అందుబాటులో ఉంటానని అతడు వెల్లడించాడు.
ఇదీ చదవండి: 'ఒలింపిక్స్ ఆటగాళ్లకు త్వరలోనే కొవిడ్ టీకా'