ఉమ్మి, చెమట ఉపయోగించకుండా బంతిని స్వింగ్ చేసేందుకు వినూత్నమైన సలహా ఇచ్చాడు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్. బంతికి మెరుపు అవసరం లేకుండా ఒకవైపు బరువు పెంచితే బాగుంటుందని సూచించాడు. కొవిడ్ 19 ముప్పు నేపథ్యంలో బంతిని ఉమ్మితో రుద్దడం ప్రమాదకరమని అంతా భావిస్తున్న నేపథ్యంలో వార్న్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'నిరంతరం స్వింగయ్యేలా ఓవైపు బంతి బరువు ఎందుకు పెంచకూడదు? అప్పుడది టేప్ వేసిన టెన్నిస్ బంతిలా ఉంటుంది. వాతావరణం వేడిగా ఉన్నా, వికెట్లు ఫ్లాట్‌గా ఉన్నా రెండు, మూడో రోజు తర్వాత స్వింగ్ అవుతుంది. బంతి బరువు పెంచితే ట్యాంపరింగ్ బెడద ఉండదు. సీసా మూతలు, ఉప్పుకాగితం వంటివి అవసరం లేదు' -షేన్ వార్న్, ఆసీస్ మాజీ క్రికెటర్
క్రికెట్లో ఇప్పటి వరకు బ్యాట్ పరిమాణం, బరువుల్లో మార్పులు వచ్చాయి కానీ బంతిలో ఎలాంటి మార్పులేదని వార్న్ స్పష్టం చేశాడు. ఇప్పుడు బంతి బరువు పెంచితే లెక్క సరిపోతుందని పేర్కొన్నాడు.
'బ్యాట్లు ఎలా పరిణామం చెందాయో చూడండి. 1980ల నాటి బ్యాటు పట్టుకొని ఇప్పటి బ్యాట్లు పట్టుకుంటే ఎంత తేడా ఉంటుంది. ఇప్పటివి చాలా తేలిగ్గా ఉంటాయి. మరి బంతి మాత్రం ఎందుకు మారలేదు?' -వార్న్, ఆసీస్ మాజీ క్రికెటర్