రానున్న ఐపీఎల్ సీజన్‌పై ఇంకా నీలినీడలు తొలిగిపోవట్లేదు. కానీ దిల్లీ క్యాపిటల్స్ అధికారి ఒకరు చెప్పిన ప్రకారం, రానున్న సీజన్.. మార్చి 29నే ప్రారంభం కానున్నట్లు స్పష్టమవుతోంది. మొదటి రోజు.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్.. సొంతమైదానం వాంఖడేలో తొలి మ్యాచ్ ఆడనుంది.
"ఐపీఎల్-2020 మార్చి 29న ప్రారంభమవుతుంది. వాంఖడే వేదికగా మొదటి మ్యాచ్ జరుగుతుంది"
-దిల్లీ క్యాపిటల్స్ అధికారి
మార్చి 29న ఐపీఎల్ ప్రారంభమైతే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెటర్లు.. మొదటి రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం కోల్పోతారు. ఈ విషయమై ఫ్రాంచైజీలూ ఆందోళనగా ఉన్నాయి. ఏప్రిల్ 1న ఐపీఎల్ ప్రారంభించాలని ఇప్పటికే వీరంతా పాలకమండలికి విన్నవించారు. కానీ ప్రారంభతేదీ మార్పుపై ఎటువంటి సమాచారం లేనట్లు తెలుస్తోంది.
"మార్చి 29న జరిగే చివరి టీ20తో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సిరీస్ పూర్తవుతుంది. ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరిగే రెండో టెస్టు సాంకేతికంగా మార్చి 31న ముగుస్తుంది. ఈ కారణంగా కొందరు ప్రముఖ క్రికెటర్లు తొలి మ్యాచ్‌లను మిస్సయ్యే అవకాశం ఉంది. ఇది మంచిది కాదు. ఏప్రిల్ 1న ఐపీఎల్ ప్రారంభమైతే బాగుంటుంది. ఐపీఎల్ పాలకమండలి.. ఈ విషయంపై సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నాం."
-దిల్లీ క్యాపిటల్స్ అధికారి
ఎక్కువ శాతం విదేశీ క్రికెటర్లు లేకుండా ఐపీఎల్ ప్రారంభమైతే టోర్నీ అంతగా ఆకట్టుకోదని ఫ్రాంఛైజీలు భావిస్తున్నాయి. పాలకమండలి దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాయి.
ఇవీ చూడండి.. ఐపీఎల్ ప్రదర్శనతోనే ధోనీ జట్టులోకి: కుంబ్లే