టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మాథ్యూవేడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే మోకాలి సర్జరీ చేయించుకున్న మాథ్యూ.. మంగళవారం మీడియాతో ఆన్‌లైన్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా విరాట్‌కోహ్లీని ఉద్దేశిస్తూ చాలా తెలివిగల ఆటగాడని వ్యాఖ్యానించాడు.
"టీమ్‌ఇండియా గట్టి పోటీనిచ్చే జట్టు, ఆ క్రికెటర్లు తమ అవసరానికి స్లెడ్జింగ్‌ను బాగా ఉపయోగించుకుంటారు. కెప్టెన్ కోహ్లీ మాట్లాడే మాటలు లేదా ప్రవర్తించే విధానం చాలా తెలివిగా ఉంటుంది. వాళ్లు స్లెడ్జింగ్‌ను తమకు అనుకూలంగా, తెలివిగా వినియోగించుకుంటారు. ఆ విషయంలో అందరిలానే నైపుణ్యం పొందారు. అందువల్లే నేను ఇప్పటి నుంచి ఆ జట్టుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా
---మాథ్యూవేడ్, ఆస్ట్రేలియా క్రికెటర్
మెకాలి గాయం నుంచి కోలుకున్న మాథ్యూవేడ్.. ఈ వారం నుంచి టాస్మానియా టీమ్‌తో ప్రాక్టీస్ మొదలెడుతున్నట్లు వెల్లడించాడు. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా వెళ్లే ఇంగ్లాండ్ పర్యటనకు తనను ఎంపిక చేస్తారని ఆశాభావం వ్యక్తంచేశాడు.
"ఇంగ్లాండ్ పర్యటనలో నేనుంటే సంతోషిస్తా. కానీ ఆల్‌రౌండర్ గ్లెన్‌మాక్స్‌వెల్ మళ్లీ జట్టులో కలుస్తాడని భావిస్తున్నా. ప్రస్తుత టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో మాక్స్‌వెల్ ఒకడు. దాంతో ఏదో ఒక సమయంలో అతడు జట్టులో కలుస్తాడు. ఇక నా విషయానికొస్తే.. నన్ను నేను అదనపు ఆటగాడిగానే పరిగణించుకుంటా. అదనపు కీపర్, అదనపు బ్యాట్స్‌మన్‌గా భావిస్తా" అని వేడ్ పేర్కొన్నాడు.
ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌పై ఇంకా స్పష్టత రానప్పటికీ టీమ్‌ఇండియాతో మాత్రం టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు నిర్వహించడానికి షెడ్యూల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత్ , ఆస్ట్రేలియా జట్లు డిసెంబర్‌లో నాలుగు టెస్టులు ఆడనున్నాయి.