దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ శతకంతో రీఎంట్రీ ఇస్తాడని దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న సిడ్నీ టెస్టులో అతడు సత్తాచాటుతాడని పేర్కొన్నాడు. మయాంక్ అగర్వాల్ విఫలమవుతుండటం వల్ల హిట్‌మ్యాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని అభిప్రాయపడ్డాడు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లో రోహిత్ గాయపడ్డాడు. ఆ తర్వాత ఐపీఎల్ ఆడినప్పటికీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు.
"విరాట్ కోహ్లీ గైర్హాజరీలో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరడంపై టీమ్ఇండియా ఎంతో సంతోషిస్తుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో మరింత అనుభవం కావాలి. ఎందుకంటే సిడ్నీలో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో లేదా 3-1తో ముగించే అవకాశాలు భారత్‌కు ఉన్నాయి. రోహిత్ తన ప్రతిభను చూపించాలనుకుంటున్నాడు. అతడి బ్యాటింగ్ స్టైల్‌కు ఆస్ట్రేలియా పిచ్‌లు ఎంతో నప్పుతాయి. అతడు కొత్తబంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటే భారీ శతకం కచ్చితంగా సాధిస్తాడు."
-లక్ష్మణ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
తొలి టెస్టులో ఘోరపరాజయం అనంతరం అద్భుతంగా పుంజుకుని రెండో మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించడంపై లక్ష్మణ్ స్పందించాడు. విజయంలో ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది కృషి ఎంతో ఉందని అన్నాడు.