భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని అవసరమైతే నాలుగో స్థానంలో ఆడిస్తామని కోచ్ రవిశాస్త్రి తెలిపారు. రాయుడు లేదా వేరే ఎవరినైనా మూడో స్థానంలో ఆడించే అవకాశముందని ఆయన అన్నారు. హామిల్టన్ వన్డేలో 90 పరుగులతో అంబటి రాయుడు మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడని గుర్తుచేశారు.
భారత పరిమిత ఓవర్ల క్రికెట్లో గత కొంతకాలంగా మూడో స్థానం కోహ్లీదే. తాజాగా రవిశాస్త్రి వ్యాఖ్యలతో కీలకమైన ప్రపంచకప్ ముందు జట్టులో మార్పులు ఎప్పుడైనా జరగొచ్చనేది స్పష్టమైంది.
వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో మిడిల్ ఆర్డర్లో విరాట్ కీలకం కానున్నాడని ఆయన అన్నారు. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్లో ఆడేటప్పుడు జట్టు సమతూకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
"ఇంగ్లాండ్తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ ఓటమి గురించి నేను పట్టించుకోను, మాకు అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది" అని స్పష్టం చేశారు రవిశాస్త్రి.
రాయుడు బ్యాటింగ్ శైలి ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉన్నప్పటికీ... అదే జట్టుకు అదనపు బలం చేకూరుస్తుందని వివరించారు రవిశాస్త్రి. "కొన్నిసార్లు అతడు అసాధారణ షాట్లు ఆడతాడు. అతని ఆట మ్యాచ్ ఫలితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది" అని కొనియాడారు.