ఏ బ్యాట్స్‌మెన్ అయినా క్రీజులో దిగగానే డిఫెన్స్ ఆడాలని చూస్తాడు. అయితే వచ్చి రాగానే బంతిని బౌండరీ దాటించాడంటే అర్థం చేసుకోవచ్చు.. అక్కడున్నది వీరేంద్ర సెహ్వాగ్ అని. తన ఆటతో కోట్లాది మంది భారతీయులకు ఆరాధ్యుడిగా మారాడు. బ్యాట్‌తో బౌండరీ బాదినంత తేలిగ్గా ట్విటర్‌లో పంచులు విసురుతూ ఆ అభిమానాన్ని మరింత పెంచుకున్నాడు. వీరూ పుట్టినరోజు సందర్భంగా అతడి పంచింగ్ ట్వీట్లపై ప్రత్యేక కథనం.
ట్రిపుల్ సెంచరీలు చేసింది నేను కాదు.. నా బ్యాట్..!
'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది'.. 'క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్ ప్రపంచకప్ గెలవలేదు. అయినా ఆ మెగాటోర్నీల్లో ఆడుతోంది'.. 'కబడ్డీ కనిపెట్టిన భారత్ ఎనిమిదోసారి ప్రపంచ ఛాంపియన్ అయింది. క్రికెట్‌ని కనిపెట్టిన దేశం, ఇంకా ఇతరుల తప్పులను వెతుకుతోంది'.. ఇవి వీరేంద్రుడు గతంలో చేసిన కొన్ని పంచ్ ట్వీట్లు.
2016 రియో ఒలింపిక్స్ సందర్భంగా భారత అథ్లెట్లు రెండు పతకాలే సాధించినా వారికి ఇక్కడ ఘన స్వాగతం పలికారు అభిమానులు. పీర్స్ మోర్గాన్ అనే ఇంగ్లిష్ జర్నలిస్టు ఆ ఫొటోలను పోస్టు చేస్తూ.. '1.2 బిలియన్ల జనాభా ఉన్న దేశం. రెండు పతకాలకే సంబరాలు చేసుకుంటుంది, సిగ్గుగా అనిపించడం లేదా?' అని ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ అదే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. 'చిన్నచిన్న విషయాలనే మేం పెద్దవిగా ఆస్వాదిస్తాం. కానీ, క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్ ఇంకా ప్రపంచకప్ గెలవాల్సి ఉంది. అయినా ప్రపంచకప్ ఈవెంట్లు ఆడుతోంది. సిగ్గుగా లేదా?' అని అప్పట్లో ప్రశ్నించాడు.
ట్విట్టర్‌తో వినూత్నంగా ఆదాయం
సెహ్వాగ్ సరదా ట్వీట్లు:
- అశ్విన్ ఏడోసారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన సందర్భంలో అతడికి అభినందనలు తెలుపుతూ 'త్వరగా ఇంటికి చేరుకోవాలనే విషయం వివాహితుడికి మాత్రమే అర్థం అవుతుంది' అని సరదాగా వ్యాఖ్యానించాడు.
- క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ జన్మదినం సందర్భంగా మూడు వేర్వేరు ఫొటోలను జతచేశాడు. అందులో ఒకటి డాన్ ఫొటో, రెండోది బ్రెడ్, మూడోది ఒక వ్యక్తి. ఇలా మూడు ఫొటోలతో డాన్‌బ్రాడ్‌మన్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
- ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా జన్మదినం సందర్భంగా ఈరోజు మనమంతా గన్నా(చెరుకు) జూస్ తాగి వినోద్ ఖన్నాకు శుభాకాంక్షలు తెలుపుదాం అన్నాడు.
- ఓ సారి విరాట్ కోహ్లీని పొగుడుతూ 'హజ్మేకి గోలీ, రంగోంకి హోలి, బ్యాటింగ్ మె కోహ్లీ.. యావత్ భారత్ ఇష్టపడుతుందని' ట్వీట్ చేశాడు.
- ఈ రోజుల్లో కళ్లు మూసుకున్నా, టెన్షన్ లేకున్నా నిద్రరాదు. వైఫై బంద్ చేస్తేనే నిద్రవస్తుందని జోక్ పేల్చాడు.
- ప్రముఖ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ను కొనియాడుతూ 'ఆమె పేరు సెరెనా, అయినా టైటిల్స్ గెలవడంలో 'నా' చెప్పదు. గెలుస్తూనే ఉంటుందని ట్వీట్ చేశాడు