సరిగ్గా ఏడాది క్రితం నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో స్ట్రైక్ రొటేట్ చేయడానికే ఇబ్బంది పడ్డాడు. తాజాగా నాగ్‌పూర్ వన్డే ఉత్కంఠగా సాగుతున్న సమయంలో రెండు వికెట్లు పడగొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు భారత ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్. ప్రపంచకప్ దగ్గరకొస్తున్న తరుణంలో ఆసీస్‌తో రెండో వన్డేలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌పై విజయశంకర్ చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు.
ప్రపంచకప్‌లో చోటుపై..
నేను ఇంతవరకు ప్రపంచ కప్ గురించి ఆలోచించలేదు. ఇంకా చాలా సమయం ఉంది. జట్టు గెలుపు కోసం నా వంతు కృషి చేస్తాను. ప్రతి మ్యాచ్ ముఖ్యమే.
నిదహాస్ ట్రోఫీలో ప్రదర్శనపై..
గతేడాది జరిగిన నిదహాస్ ట్రోఫీని మర్చిపోలేను. ఆ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించడం లాంటి చాలా విషయాలను నేర్చుకున్నాను. నిన్న జరిగిన మ్యాచ్‌లో 43వ ఓవర్ తర్వాత బౌలింగ్ చేయాల్సి వస్తుందని నాకు ముందే తెలిసింది. మానసికంగా ముందుగానే సన్నద్ధమయ్యాను.
ఫైనల్ ఓవర్లో..
48వ ఓవర్ అనంతరం బుమ్రా నా వద్దకొచ్చి బంతి రివర్స్‌స్వింగ్ అవుతుందని చెప్పాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో వేయమని సూచించాడు. బంతిని సూటిగా వేసినట్లయితే పరుగులు నియంత్రిస్తూనే వికెట్లు తీసే అవకాశముంటుంది.
విజయానంతరం స్పందనపై..
చివరి ఓవర్లో రెండు వికెట్లు తీసిన తర్వాత మరీ ఎక్కువగా సంబరాలు చేసుకోలేదు. ఆ క్షణం ఆ అనుభూతిని ఆస్వాదించానంతే.
రనౌట్‌పై..
బ్యాటింగ్‌లో 41 బంతుల్లో 46 పరుగులు చేశాను. రనౌట్ కావడం దురదృష్టం అని నేను బావించట్లేదు. కోహ్లీ బంతిని బలంగా కొట్టాడు. క్రీజులోకి వెళ్లే సమయం నాకు దొరకలేదు. ఆటలో ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి.
ఆసీస్ విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు కావాలి. 2 వికెట్లు తీస్తే గెలుపు భారత్‌ని వరిస్తుంది. క్రీజులో అర్ధసెంచరీతో జోరుమీదున్న స్టాయినిస్. అలాంటి పరిస్థితుల్లో బంతి విజయ్ చేతికిచ్చాడు కెప్టెన్ కోహ్లీ. తొలి బంతికే స్టాయినిస్‌ని ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. రెండో బంతికి రెండు పరుగుల రాగా, మూడో బంతితో ఆడమ్ జంపాను క్లీన్ బౌల్డ్ చేసి జట్టును గెలిపించాడు.