దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పుంజుకుంది. 395 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రొటీస్ ముందు ఉంచింది. ఇంకొక్క రోజే మిగిలి ఉన్న నేపథ్యంలో అంత స్కోరు ఛేదించడం సఫారీలకు కష్టమే. కానీ తాము తప్పక విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు ఆ జట్టు పేసర్ వెర్నర్ ఫిలండర్. '
"మేము ఇక్కడకు వచ్చినపుడు టీమిండియా పరుగులు చేయకుండా కట్టడి చేయాలని నేనూ, రబాడా అనుకున్నాం. కానీ మా స్పిన్నర్లను భారత్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఎదుర్కొన్నారు. 395 పరుగుల భారీ స్కోరు ఛేదించడం కొంచెం కష్టమే అని నాకు తెలుసు. కానీ మా మీద మాకు నమ్మకం ఉంది. మేము తప్పకుండా గెలుస్తామని నాకు ఆత్మవిశ్వాసం ఉంది" -ఫిలాండర్, దక్షిణాఫ్రికా పేసర్.
విశాఖ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించిందని అన్నాడు ఫిలాండర్.
"పిచ్ కొంచెం స్పిన్నర్లకు అనుకూలించింది. ఇది చాలా మంచి వికెట్. చివరిరోజు మేము మంచి ఆరంభంతో దూసుకెళ్తాం. వాళ్లు(టీమిండియా) పరుగులు చేశారంటే పిచ్ మాకు కూడా అలాగే అనుకూలిస్తుంది. మేమూ అదే రీతిలో ఆకట్టుకుంటాం" -ఫిలాండర్.
విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 395 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లోనూ రోహిత్ అద్భుతమైన శతకాన్ని అందుకున్నాడు. 149 బంతుల్లో 127 పరుగులు చేశాడు. పుజారా 81 పరుగులతో జట్టు భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.
ఇదీ చదవండి: 'హండ్రెడ్ లీగ్ కన్నా ఐపీఎల్ అత్యుత్తమం'