ఐపీఎల్లో గాయపడిన ముంబయి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
ఆసీస్‌తో టీ20 సిరీస్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే అతడి కుడి భుజానికి గాయమైందని, అలానే ఈ సీజన్ ఆడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కోల్‌కతా ఫ్రాంచైజీ.. టీమ్ఇండియా సెలక్షన్ కమిటీకి చెప్పలేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ విషయం తెలియకే బోర్డు అతడిని ఆసీస్ పర్యటనకు ఎంపిక చేసిందని అంటున్నారు.
"వరుణ్ కుడి భుజానికి గాయమైంది. దాని నుంచి కోలుకోవాలంటే సర్జరీ అవసరం. సరిగ్గా బంతిని కూడా విసరలేకపోతున్నాడు. కానీ ఐపీఎల్లో ఆడాలనే ఆసక్తితో చికిత్స లేకుండానే బరిలో దిగాడు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఫ్రాంచైజీ, ఈ విషయాన్ని తమ జట్టు సీజన్ నుంచి నిష్క్రమించిన తర్వాత టీమ్ఇండియా సెలక్టరకు తెలిపింది. ఓ ఆటగాడి గాయాన్ని ఇక్కడ దాచినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతానికి బౌలింగ్ చేయడానికి అతడు ఫిట్‌గా ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాలోని పెద్ద మైదానాల్లో బంతి వేయడం కష్టమవుతుంది"
-క్రికెట్ వర్గాలు
ఆరు వారాలు పట్టొచ్చు
దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో మిగతా ఆటగాళ్లతో కలిసి ట్రైనింగ్ సెషన్లో వరుణ్ చక్రవర్తి పాల్గొన్నాడు. ఫిజియో ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గాయం మానడానికి దాదాపు ఆరు వారాల సమయం పట్టొచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
రోహిత్ ఆడే అవకాశముంది
ఐపీఎల్లో గాయపడిన రోహిత్ శర్మ.. కోలుకుని గత రెండు మ్యాచుల్లో ఆడాడు. కాబట్టి ఆసీస్ పర్యటన కోసం బీసీసీఐ వైద్య బృందం మరోసారి అతడి ఫిట్నెస్ను పరిశీలించి, జట్టులోకి తీసుకునే అవకాశముంది.