స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దురదృష్టం ఇంకా వెంటాడుతోందా? ఇప్పటికే గాయంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లలేకపోయిన అతడు.. ఇంగ్లాండ్‌తో అయిదు టీ20ల సిరీస్‌కు కూడా దూరం కాబోతున్నాడా? ఔననే అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు. ఫిట్‌నెస్ పరీక్షను అధిగమించలేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. జట్టులో స్థానం సంపాదించాలంటే యోయో పరీక్షలో 17.1 పాయింట్లు సాధించాలి లేదా 8.5 నిమిషాల్లో 2 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాలని ఇటీవలే బీసీసీఐ కొత్త నిబంధన పెట్టింది.
కానీ వరుణ్ ఈ పరీక్షల్లో సఫలం కాలేకపోయాడని సమాచారం. గత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 13 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి ఆస్ట్రేలియా పర్యటనలో భారత టీ20 జట్టుకు ఎంపికైన చక్రవర్తి.. గాయం కారణంగా అరంగేట్రం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన అతడు మళ్లీ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు జట్టులోకొచ్చాడు. కానీ మళ్లీ దురదృష్టం వెంటాడినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: వేదికలపై ఫ్రాంచైజీల నిరసన గళం