అండర్-19 ప్రపంచకప్ కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో తిరస్కరణకు గురయ్యాడు. అయినా పట్టు వదలని విక్రమార్కునిలా మొండిగా నిలిచాడు. ఎట్టకేలకు స్థానం సంపాదించాడు. ఇదే టోర్నీలో ఆసాంతం రాణించి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. భవిష్యత్తు టీమిండియా తారగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడే రవి బిష్ణోయ్.
రవి సొంత రాష్ట్రం రాజస్థాన్. అక్కడ జరిగిన అండర్ 17, అండర్ 19 సెలక్షన్ ట్రయల్స్‌లో ఇతడిని మొదట తిరస్కరించారు. తనను కాదన్నందుకు మరింత పట్టుదల పెంచుకున్నాడు. బోర్డు పరీక్షలను ఎగ్గొట్టాడు. చివరకు అనుకున్నది సాధించాడు. అంచెలంచెలుగా ఎదిగి.. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేసే స్థాయికి వచ్చాడు. అప్పుడు అందరి కళ్లల్లో పడ్డ ఈ బౌలర్.. అండర్-19 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు.
దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టోర్నీ ఆసాంతం రాణించి, 17 వికెట్లు పడగొట్టాడు. అందరి చేత శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఇతడిలో అద్భుతమైన ప్రతిభ ఉందని ముందే గుర్తించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. గతేడాది డిసెంబరులో జరిగిన ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.2 కోట్లు పెట్టి కొనుక్కుంది. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో అతడు ఎంతమేరకు రాణిస్తాడనేది చూడాలి.
ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన అండర్-19 ప్రపంచకప్ తుదిపోరులో ఈ లెగ్ స్పిన్నర్.. నాలుగు వికెట్లు తీయడం వల్ల ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో ఇదివరకు శ్రీవాత్సవ(2000), అభిషేక్ శర్మ(2002), కుల్‌దీప్ యాదవ్(2014), అంకుల్ రాయ్(2018) 15 వికెట్లతో ముందున్నారు.
మరోవైపు ఈ టోర్నీలో కెనడాకు చెందిన అఖిల్‌కుమార్, అఫ్గాన్‌కు చెందిన షాఫికుల్లా ఘఫారీ చెరో 16 వికెట్లతో రెండో స్థానంలో నిలిచారు. రవి.. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా మరో రికార్డు నెలకొల్పాడు. పీయుష్ చావ్లా(2006), సందీప్ శర్మ (2012) గతంలో ఈ ఘనత సాధించారు.