ఐపీఎల్లో తనకు ఎదురైన అనుభవాలను తాజాగా పంచుకున్నాడు పాకిస్థాన్ మాజీ బౌలర్ ఉమర్ గుల్. 2008 ఐపీఎల్ ప్రారంభ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఉమర్.. తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
"మొదటిసారి ఓ ప్రైవేట్ లీగ్‌లో పాల్గొనడం మాకెంతో సంతోషాన్నిచ్చింది. 2007 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచా. దాంతో ఐపీఎల్లో దాదాపుగా చివర్లో నన్ను ఎంపిక చేశారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై కోల్‌కతాతో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్రెండన్ మెక్‌కలమ్ 158 పరుగులు చేశాడు. ఆ సమయంలో అందరం చాలా సంతోషించాం. ఇండియాలో పాక్ ఆటగాళ్లకు అభిమానులు చాలా మందే ఉన్నారు. ఐపీఎల్ ఇతర టోర్నీలతో పోలిస్తే పూర్తిగా భిన్నమైనది. ఈ లీగ్ ఓ పండుగను తలపిస్తుంది".
- ఉమర్ గుల్, పాకిస్థాన్ మాజీ బౌలర్
ఐపీఎల్ ప్రారంభ టోర్నీలో కోల్‌కతా తరపున కేవలం ఆరు మ్యాచ్‌లే ఆడాడు ఉమర్ గుల్. 15.33 సగటుతో 12 వికెట్లు సాధించాడు. తన బౌలింగ్ ప్రదర్శనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
షారుక్ ఖాన్.. సహ యజమానిగా వ్యవహరిస్తున్న కోల్‌కతా జట్టు తరపున ఆడటం తనకెంతో ఆనందాన్నిచ్చిందని తెలిపాడు గుల్. మ్యాచ్ అనంతరం ఫొటోషూట్లతో పాటు పార్టీలకు వెళ్లేవారమని గుర్తుచేసుకున్నాడు. రికీ పాంటింగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం వల్ల తాను చాలా నేర్చుకున్నట్లు తెలిపాడు.
పాక్ ఆటగాళ్లపై నిషేధం
ఐపీఎల్ ప్రారంభ టోర్నీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లకు అందులో పాల్గొనే అవకాశం దక్కింది. అయితే 26/11 ముంబయి దాడుల తర్వాత ఈ లీగ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లపై నిషేధం విధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు అదే విధంగా కొనసాగుతున్నాయి.