దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న అండర్ 19 ప్రపంచకప్ టోర్నీ తుది ఘట్టానికి చేరుకుంది. నాలుగుసార్లు ఛాంపియన్ భారత యువజట్టు తొలిసారి ఫైనల్ చేరిన బంగ్లాదేశ్ యువజట్టుతో నేడు ఫైనల్‌లో తలపడనుంది. సెమీస్‌లో టీమిండియా.. పాక్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేయగా న్యూజిలాండ్‌పై 6 వికెట్ల తేడాతో నెగ్గిన బంగ్లాదేశ్ తొలిసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఐదోసారి కప్పు గెలవాలనే పట్టుదలతో భారత యువజట్టు ఉండగా.. అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ చేరిన బంగ్లా తొలిసారి కప్పును ముద్దాడాలని అనుకుంటోంది.
2000 సంవత్సరంలో తొలిసారి అండర్ 19 కప్పు గెలిచిన భారత్ ఆ తర్వాత ఫైనల్‌కు రావడం ఇది ఏడోసారి కాగా తుదిసమరంలో ప్రస్తుత ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను గత ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లోనే ఓడించింది. ఇదే సమయంలో ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు వివిధ దేశాల్లో దాదాపు 30 మ్యాచ్‌లు ఆడటంతో పాటు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ శిక్షణలో అబేధ్యంగా తయారైంది. ప్రస్తుత టోర్నీలో టీమిండియా ఆరంభం నుంచి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటుతోంది. గ్రూపు దశలో శ్రీలంక, జపాన్, న్యూజిలాండ్‌పై గెలిచిన యువభారత్.. తర్వాత క్వార్టర్స్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి.. సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో దాయాది పాక్‌ను ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌కు చేరింది.
గ్రూప్ దశలో జింబాబ్వే, స్కాట్లాండ్ వంటి చిన్న జట్లపై నెగ్గిన బంగ్లాదేశ్.. క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై, సెమీస్‌లో న్యూజిలాండ్ వంటి బలమైన జట్లను ఓడించి.. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్‌తో అమీతుమీకి సిద్ధమైంది.
యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా, కార్తిక్ త్యాగీ, రవి బిష్ణోయ్‌లు విజృంభిస్తుండటం టీమిండియాకు సానుకూలాంశం. అంతా సమష్టిగా మరోసారి రాణిస్తే.. భారత యువజట్టు ఐదోసారి అండర్-19 ప్రపంచకప్‌ను అందుకోవడం ఖాయమని చెప్పవచ్చు.