ఐసీసీ మహిళా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు సత్తాచాటింది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ గెలుపొందినందున టీం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరింది. ఈ సిరీస్‌లో 8 వికెట్లతో మంచి ప్రదర్శన కనబర్చిన జులాన్ గోస్వామి బౌలర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.
బ్యాట్స్ ఉమెన్ ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ మహిళా ఛాంపియన్‌షిప్‌లో 837 పరుగులతో ఆకట్టుకున్న ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ ఉమెన్ కెరీర్లో ఉత్తమంగా 797 పాయింట్లకు చేరింది. బ్యాట్స్ ఉమెన్, బౌలింగ్ రెండు విభాగాల్లో భారత ఆటగాళ్లు మొదటి ర్యాంకులో నిలవడం ఇది రెండోసారి. 2012 మార్చిలో మిథాలీ, గోస్వామి ఈ ఘనత సాధించారు.
ప్రస్తుతం 218 వికెట్లతో వన్డేల్లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచిన గోస్వామి ఎక్కువ రోజులు టాప్ ర్యాంక్‌లో ఉన్న క్రికెటర్‌గా నిలవడానికి కొద్ది దూరంలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్ కేథరిన్ ఫిట్జ్ ప్యాట్రిక్ 2,113 రోజులు నంబర్ వన్ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం గోస్వామి 1,873 రోజుల వద్ద ఉంది. మరో బౌలర్ శిఖాపాండే 12 స్థానాలు ఎగబాకి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.