అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్.. సచిన్‌ను తలపించే బ్యాక్‌ఫుట్ ఆట.. చిన్న వయసులోనే జాతీయ జట్టులో చోటు.. అరంగేట్రంలోనే శతకం.. ఇక టీమ్‌ఇండియా ఓపెనింగ్ కష్టాలు తీరినట్టేనని కితాబు.. ఇవీ రెండేళ్ల క్రితం యువ ఆటగాడు పృథ్వీషాపై మాజీ క్రికెటర్లు, అభిమానుల ప్రశంసలు.
'పృథ్వీషా ప్రతిభావంతుడు. అతడి ఆటలో సచిన్, సెహ్వాగ్, లారా కనిపిస్తారు'- టీమ్‌ఇండియా కోచ్ రవిశాస్త్రి మొన్నీమధ్యే చేసిన వ్యాఖ్య. కానీ ఇప్పుడదే ఆటగాడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. నాణ్యమైన బౌలింగ్‌లో కనీసం రెండంకెల స్కోరు అందుకొనేందుకూ ఇబ్బంది పడుతున్నాడు. అటు క్యాచులు పట్టడంలోనూ విఫలమవుతున్నాడు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు రెండు ఇన్నింగ్సుల్లోనూ విఫలమైన పృథ్వీషాపై విమర్శల ఎక్కువయ్యాయి. మాజీ క్రికెటర్లు, అభిమానులు గులాబి టెస్టులో అతడికి ఎందుకు అవకాశమిచ్చారని ప్రశ్నిస్తున్నారు. సన్నాహక మ్యాచులోనే సత్తా చాటాలేకపోయిన అతడిని ఏ ప్రాతిపదికన తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అద్భుతంగా ఆడగలిగే కేఎల్ రాహుల్, పరిణతి కనబరుస్తూ మంచి టచ్‌లో ఉన్నా శుభ్‌మన్‌గిల్ ఉండగా అతడిని ఎందుకు తీసుకున్నారని ట్విటర్లో ట్రోల్ చేస్తున్నారు.
విమర్శలకు తగ్గట్టే తొలి టెస్టులో పృథ్వీషా రెండు ఇన్నింగ్సుల్లోనూ ఒకేలా ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే వికెట్లు ఎగిరాయి. పరుగులేమీ చేయకుండానే అతడు నిష్క్రమించాడు. ఆఫ్‌సైడ్‌లో పిచై ఇన్‌స్వింగైన బంతిని ఆడే క్రమంలో అతడు విఫలమవుతున్నాడు. ఫ్రంట్‌ఫుట్‌ను ఇంకాస్త జరపడం లేదు. దాంతో బ్యాటు, ప్యాడ్ల మధ్యలోంచి బంతి వెళ్లి వికెట్లను తాకుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్ వేసిన బంతీ అలాగే వికెట్ల మీదకు వచ్చింది. ఫలితంగా వికెట్లు ఎగిరిపడ్డాయి.
పింక్ టెస్టులో 0, 4 పరుగులే చేసిన షాను 'మొదటి బంతిని సచిన్, రెండో బంతిని వీరూ.. మూడో బంతిని లారా ఆడారు. నాలుగో బంతికి వీరు ముగ్గురూ ఔటయ్యారు' అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఐపీఎల్‌లోనూ షాకు ఇలాగే బంతులేసి ప్రత్యర్థులు ఫలితం రాబట్టారు. బహుశా ఈ సిరీసులో అతడికి మళ్లీ అవకాశం ఇవ్వకపోవచ్చు. రెండో టెస్టులో శుభ్‌మన్ లేదా రాహుల్‌కు స్థానం దొరకొచ్చు. ఇక మూడో టెస్టు నుంచి రోహిత్ అందుబాటులోకి రానున్నాడు.