బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో శతకం బాది పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ. ఈ శతకం టెస్టుల్లో కోహ్లీకి 27వది. ఆడిన తొలి గులాబి బంతి టెస్టులోనే సెంచరీ చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అలాగే టెస్టుల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల్ని పూర్తి చేసిన తొలి ఇండియన్ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ 86 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. ఆస్ట్రేలియా సారథి పాంటింగ్‌కు 97 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ మ్యాచ్‌లో సెంచరీతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ల లిస్టులో రెండో స్థానానికి చేరాడు. ఇది టెస్టు సారథిగా కోహ్లీకి 20వ సెంచరీ. ఒకసారి టాప్-5 టెస్టు సెంచరీల సారథులను చూద్దాం.
5.స్టీవ్ వా (15)
ఆస్ట్రేలియా జట్టుకు విజయమంతమైన కెప్టెన్లలో స్టీవ్ వా ముందుంటాడు. ఇతడి సారథ్యంలో ఆసీస్ వరుసగా 16 టెస్టు విజయాలు సాధించి రికార్డు సృష్టించింది. నాయకత్వ లక్షణాలతోనే కాక తన బ్యాటింగ్‌తో జట్టుకు మరపురాని విజయాలనందించాడు స్టీవ్.
1999-2004 మధ్య కాలంలో ఆసీస్ తరఫున 57 టెస్టులకు సారథ్యం వహించాడు స్టీవ్ వా. 52.30 సగటుతో 15 శతకాలు సాధించాడు. 199 పరుగులు అత్యధికం.
4. స్టీవ్ స్మిత్ (15)
స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాకు గొప్ప కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్నాడు. కానీ 2018లో బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమవ్వడమే కాక కెప్టెన్సీ పదవినీ పోగొట్టుకున్నాడు. కానీ ఇతడు సారథిగా ఉన్న కాలంలో తన బ్యాటింగ్‌తో అలరించాడు. వివాదం ముగిసి ప్రస్తుతం ఆటను కొనసాగిస్తోన్న స్మిత్ అదే దూకుడును ప్రదర్శిస్తున్నాడు.
2014-18 మధ్య కాలంలో 34 టెస్టులకు సారథ్యం వహించాడు స్మిత్. 70.36 సగటుతో 3,659 పరుగులు సాధించాడు. ఇందులో 15 సెంచరీలు ఉన్నాయి.
3. రికీ పాంటింగ్ (19)
అత్యధిక సెంచరీలు సాధించిన టెస్టు కెప్టెన్లలో మరో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. 77 టెస్టుల్లో ఆసీస్‌కు సారథ్యం వహించిన పాంటింగ్ 51.51 సగటుతో 6,542 పరుగులు సాధించాడు. 19 సెంచరీలను ఖాతాలో వేసుకున్నాడు. స్టీవ్ వా తర్వాత ఆసీస్‌కు విజయవంతమైన కెప్టెన్‌గా తయారైన ఈ ఆటగాడు మూడో స్థానంలో డేంజరస్ బ్యాట్స్‌మన్‌గా పేరుతెచ్చుకున్నాడు.
2. విరాట్ కోహ్లీ (20)
అతి తక్కువ కాలంలోనే టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికై సత్తాచాటుతున్నాడు కోహ్లీ. ఇప్పటివరకు 53 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఈ ఆటగాడు 63.80 సగటుతో 5,104 పరుగులు చేశాడు. ఇందులో 20 సెంచరీలు ఉన్నాయి. వయసుతో పాటే ఆటనూ మెరుగుపర్చుకుంటున్న కోహ్లీ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన పుణె టెస్టులో కెరీర్లో అత్యధికంగా 254 పరుగులు చేశాడు.
1. గ్రేమ్ స్మిత్ (25)
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్. 109 టెస్టుల్లో సఫారీ జట్టును ముందుండి నడిపించిన స్మిత్ 47.83 సగటుతో 8,659 పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలు ఉన్నాయి.
ఇవీ చూడండి.. ఆసీస్‌తో 'పింక్ టెస్టు'పై గంగూలీ సమాధానమిదే..!