సిడ్నీ మైదానంలో తన ప్రవర్తనకు గాను క్షమాపణ చెప్పాడు ఆస్ట్రేలియా సారథి టిమ్ పైన్. టెస్టు ఆఖరు రోజున భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో అతడు స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో భారత్, ఆసీస్ సహా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ మాజీలు, అభిమానులు అతడిపై తీవ్ర విమర్శలు చేశారు.
"నేను సరిగ్గా నాయకత్వం వహించలేకపోయా. నా అంచనాలు, జట్టు ప్రమాణాలను అందుకోలేకపోయా. నేనూ మనిషినే. నిన్న(సోమవారం) నేను చేసిన తప్పులకు క్షమాపణ చెబుతున్నా. సారథిగా ఈ విధంగా ప్రవర్తించాల్సింది కాదు."
-టిమ్ పైన్, ఆస్ట్రేలియా సారథి.
భారత్, ఆసీస్ మధ్య సిడ్నీలో మూడో టెస్టు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. భారత్‌ను గట్టెక్కించే క్రమంలో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు అశ్విన్, విహారి. వీరి పోరాట పటిమను దెబ్బతీయడానికి అశ్విన్‌తో స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు పైన్. అయితే అశ్విన్ కూడా ఏమాత్రం తగ్గకుండా పైన్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జనవరి 15న ప్రారంభంకానుంది. ఇప్పటికే జరిగిన మూడు టెస్టుల్లో ఇరు జట్లు చెరో విజయం సాధించాయి. రక్తికట్టించిన సిడ్నీ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇదీ చూడండి: కెప్టెన్‌గా పైన్‌కు రోజులు దగ్గర పడ్డాయి: గావస్కర్