ప్రపంచ క్రికెట్‌కు పెనుభూతంగా మారిన ఫిక్సింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఐసీసీ. ఇందుకోసం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లను ఐసీసీ విచారిస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ క్రీడాశాఖ మంత్రి డుల్లాస్ అలహపెరుమ బుధవారం వెల్లడించారు. అయితే, ఆ ముగ్గురు ఎవరనేది మాత్రం ఆయన చెప్పలేదు.
క్రీడల్లో క్రమశిక్షణ, వ్యక్తిత్వం దిగజారిపోయాయని ఆయన విచారం వ్యక్తంచేశారు. ఈ విషయంపై స్పందించిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఐసీసీ అవినీతి నిరోధక అధికారుల విచారణలో ప్రస్తుత క్రికెటర్లు లేరని ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది.
"క్రీడాశాఖా మంత్రి పేర్కొన్న విధంగా.. ఐసీసీ విచారణ ఎదుర్కొంటున్నది శ్రీలంక మాజీ ఆటగాళ్లని మేం కచ్చితంగా నమ్ముతున్నాం. ప్రస్తుత ఆటగాళ్లు కాదు" అని పేర్కొంది.
ఆశలన్నీ నేలకూల్చాడు..!
ఇటీవల డ్రగ్స్ కేసులో చిక్కుకున్న ఫాస్ట్‌బౌలర్ షెహన్ మదుశంక అరెస్టుపైనా స్పందించారు మంత్రి డుల్లాస్. అతడిపై దేశం భారీ అంచనాలు పెట్టుకుందని, కానీ అవన్నీ నిరాశపర్చాడని ఆయన పేర్కొన్నారు. 'హెరాయిన్' కలిగి ఉన్నాడనే ఆరోపణలతో మదుశంకను శ్రీలంక పోలీసులు గతవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లంక బోర్డు అతడి కాంట్రాక్టును నిలిపివేసింది.
"దిగజారిపోతున్న క్రికెట్ విలువల్ని పాఠశాల స్థాయిలోనే మెరుగుపర్చేందుకు ప్రభుత్వం త్వరలోనే దృష్టిసారిస్తుంది. పాఠశాలల నుంచి నాణ్యమైన ఆటగాళ్లు రావడం లేదనే విషయం మా దృష్టికి వచ్చింది" అని డుల్లాస్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ప్రధాని మహింద రాజపక్సతో జరిగిన ఓ సమావేశంలో లంక దిగ్గజ ఆటగాళ్లు సంగక్కర, జయవర్ధనే, జయసూర్య పాల్గొని.. క్షేత్రస్థాయిలో క్రికెట్‌ను మెరుగు పర్చాలని కోరారు.
ఇదీ చూడండి : కరోనా పాజిటివ్ వచ్చినా.. కారు జోరు ఆగదు