విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీయడం పట్ల టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే తన అత్యుత్తమ ప్రదర్శన అని, గత పది నెలలుగా తను అత్యంత క్లిష్ట పరిస్థితులు అనుభవించానని చెప్పాడు.
2017 నుంచి ఈ ఏడాది ప్రారంభం వరకు కుల్దీప్ యాదవ్ జట్టులో రెగ్యులర్ బౌలర్‌గా కొనసాగాడు. ఐపీఎల్, ప్రపంచకప్‌ల్లో పేలవ ప్రదర్శన కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. అనంతరం మళ్లీ పుంజుకొని టీమ్‌లోకి వచ్చాడు.
"గత పదినెలలు అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా. అయితే నిలకడగా రాణించిన నేను.. ఒక్కసారిగా ఫామ్ కోల్పోయా. నా బౌలింగ్ గురించి మరోసారి ఆలోచించాల్సి వచ్చింది. ప్రపంచకప్ అనంతరం జట్టులో స్థానం కోల్పోయా. ఈ నాలుగు నెలలు తీవ్రంగా శ్రమించి మళ్లీ జట్టులోకి వచ్చా. కమ్‌బ్యాక్ కొంచెం భయంగానే అనిపించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాననే భావన కలిగింది. విశాఖ వన్డేలో తీసిన హ్యాట్రిక్ నా ఉత్తమ ప్రదర్శన. ఒత్తిడిలో దీనిని సాధించా" - కుల్దీప్ యాదవ్, టీమిండియా బౌలర్
వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత్.. 107 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ శతకాలతో విధ్వంసం సృష్టించారు. మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఈనెల 22న కటక్ వేదికగా జరగనుంది.
ఇదీ చదవండి: ఫోర్బ్స్ జాబితా.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ