కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడాటోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో గతంలో జరిగిన కొన్ని జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. క్రికెట్ ప్రపంచ ఛాంపియన్షిప్-2013లో టీమ్ఇండియా విజేతగా నిలిచిన క్షణాలను సోషల్‌మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో అప్పటికే టీ20, వన్డే ప్రపంచకప్‌లు గెలిచి భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అతని సారథ్యంలోనే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టిన భారత్.. మరో ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ చారిత్రక ఘటన నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది.
![This day that year: India beat England in thrilling final to claim 2nd Champions Trophy title in 2013](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7733763_2.jpg)
ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ తుదిపోరులో భారత్, ఇంగ్లాండ్ పోటీ పడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33) రాణించడం వల్ల భారత్ మెరుగైన స్కోర్ సాధించగలిగింది.
130 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు చేసి పరాజయం పాలైంది. ఓపెనర్లు విఫలమైనా.. మోర్గాన్ (33), బొపారా (30) మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఫలితంగా 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై టీమ్ఇండియా విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా రవీంద్ర జడేజా, 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా శిఖర్ ధావన్‌లు నిలిచారు.
![This day that year: India beat England in thrilling final to claim 2nd Champions Trophy title in 2013](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7733763_1.jpg)
రెండోసారి విజేతగా..
ఆస్ట్రేలియా తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన రెండో జట్టుగా టీమ్ఇండియా ఘనత సాధించింది. 2002లో శ్రీలంకలో జరిగిన ఛాంపియన్షిప్ టోర్నీలో వర్షం కారణంగా లంక, భారత్‌లను ఆ ఏడాది సంయుక్త విజేతలుగా ప్రకటించారు.