కరోనాతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. వేసవిలో సందడే లేకుండా పోయింది. స్టార్ హీరోల సినిమాల నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల వరకు అన్ని ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. యూఏఈలో ఐపీఎల్ నిర్వహణకు భారత ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చిన నేపథ్యంలో క్రికెటర్లు, ప్రాక్టీసుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఈపాటికే మొదలుపెట్టేశారు. వైరస్ ప్రభావం వల్ల ఈ సీజన్లో చాలా అంశాల్ని మనం మిస్సవబోతున్నాం. ఇంతకీ అవేంటంటే?
మస్కట్ లేదు.. షేక్ హ్యాండ్స్ పూర్తిగా బంద్
ఎస్ఓపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం ఈ సీజన్ టాస్ వేసేటప్పుడు టీమ్ జాబితా పేపర్లో కాకుండా డిజిటల్‌గా ఉండనుంది. ఐపీఎల్ మస్కట్ ఈసారి కనిపించదు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. కరచాలనం పూర్తిగా నిషేధం లాంటి నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఆటగాళ్లు తమ కిట్‌లోని వస్తువులను మరొకరితో పంచుకోవడానికి కూడా వీల్లేదని తెలుస్తోంది.
మైదానంలో ప్రేక్షకులు కనిపించరు
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, యూఏఈ అథారిటీలు, వైద్య నిపుణులతో పాటు పలు ఏజెన్సీలతో కలిసి బీసీసీఐ ఐపీఎల్‌ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రేక్షకులు ఎవరూ లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లు జరపనుంది.
డ్రెస్సింగ్ రూమ్‌ల్లో ఇంటర్వ్యూలు లేవు
మైదానంతో పాటే డ్రెస్సింగ్ రూమ్‌లోనూ ఆటగాళ్లు భౌతిక దూరం పాటించనున్నారు. బయో సెక్యూర్ వాతావరణంలో మ్యాచ్‌ల నిర్వహణ వల్ల బయట నుంచి ఎవరిని లోపలికి అనుమతించరు. అందువల్ల డ్రెస్సింగ్ రూమ్‌లో ఇంటర్య్వూలు ఈసారి కనిపించవు.
నో షారుక్.. నో ప్రీతి జింటా
ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు యూఏఈ వస్తే బయో సెక్యూర్ వాతావరణంలోనే ఉండాలి. ఒకవేళ అతిక్రమిస్తే ఏడు రోజులు క్వారంటైన్ సహా రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగటివ్‌గా వస్తేనే తిరిగి లోపలికి అనుమతిస్తారు.
ఒకవేళ జట్టు యజమానులు బయో సెక్యూర్‌లో లేకపోతే.. క్రికెటర్లు, ఇతర సిబ్బందితో కలిసి ఒకే బస్సులో ప్రయాణించడానికి వీలుపడదు.
కుటుంబాలతో ప్రయాణం కుదరదు
ఈ సీజన్లో క్రికెటర్లతో పాటు వారి కుటుంబాలు యూఏఈకి వచ్చినా సరే, ఒకే బస్సులో ప్రయాణించడం కుదరదు. కుటుంబ సభ్యుల్ని ట్రైనింగ్, మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు చూసేందుకు అనుమతించరు. వారికి కేటాయించిన హోటళ్లలో ఉండాల్సిందే. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే ఏడు రోజులు క్వారంటైన్లో ఉంచడం సహా రెండుసార్లు కరోనా పరీక్షలు జరిపిన తర్వాత తిరిగి బయో సెక్యూర్ వాతావరణంలోకి అనుమతిస్తారు.