టీ20 ఫార్మాట్లో భారత క్రికెటర్లకు మార్గనిర్దేశం చేయగల సామర్థ్యం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్‌కు ఉందా? అని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశ్నించాడు. "రాఠోడ్ నా స్నేహితుడు. టీ20 తరం కుర్రాళ్లకు అతడు సహాయపడగలడని మీరు అనుకుంటున్నారా?" అని ఓ ఇన్‌స్టాగ్రామ్ సెషన్ సందర్భంగా యువీ అన్నాడు. వ్యక్తిత్వాన్ని బట్టి ఒక్కో ఆటగాడి విషయంలో కోచ్ ఒక్కోరకంగా వ్యవహరించాలని యువరాజ్ చెప్పాడు. 1996 నుంచి 1997 వరకు ఆరు టెస్టులు, ఏడు వన్డేలు ఆడిన రాఠోడ్ గతేడాది సంజయ్ బంగర్ స్థానంలో టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.
"నేనే కోచ్‌నైతే రాత్రి 9 గంటలకు బుమ్రాకు గుడ్‌నైట్ చెబుతా. హార్దిక్ పాండ్యాను పది గంటలకు మందు తాగడానికి తీసుకెళ్తా. భిన్న వ్యక్తులతో అలా భిన్నంగా వ్యవహరించాలి" అని యువరాజ్ అన్నాడు. ప్రస్తుతం భారత జట్టులోని ఆటగాళ్లతో మాట్లాడేందుకు, సలహాలు ఇచ్చేందుకు ఎవరూ లేరని చెప్పాడు.
"ఆటగాళ్లను నడిపించే బాధ్యత రవిశాస్త్రిది కాదా" అన్న ప్రశ్నకు.. "రవి ఆ పని చేస్తున్నాడో లేదో నాకు తెలియదు. అతడికి ఇంకా వేరే పనులు ఉండొచ్చు" అని యువరాజ్ తన మనుసులోని మాటను వెల్లడించాడు. "వెళ్లి నీ సహజమైన ఆట ఆడు అని ఆటగాళ్లందరికీ చెప్పడం కుదరదు. అలాంటి దృక్పథం సెహ్వాగ్ లాంటి వారికి ఉపయోగపడుతుంది. కానీ పుజారాకు ఎప్పటికీ ఉపయోగపడదు. కోచింగ్ సిబ్బంది దీన్ని గ్రహించాలి" అని యువరాజ్ చెప్పాడు.
ఇదీ చూడండి.. 'అప్పుడేముంది.. ఇప్పుడైతే మరో 4 వేలు చేసేవాళ్లం'