గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ తిరిగి మైదానంలో అడుగుపెట్టకపోవడం వల్ల అతడు మళ్లీ ఆడితే మునుపటిలా జోరు ప్రదర్శించగలడా? బ్యాటింగ్‌లో రాణించగలడా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు మాత్రం ధోనీ సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. మార్చిలో సీఎస్కే శిక్షణ శిబిరంలో మహీ పాల్గొన్నాడు.
"ధోనీ పూర్తి దృష్టి సారించి ప్రాక్టీస్ కొనసాగించాడు. మ్యాచ్‌లో ఆడేటపుడు ఎలాంటి తీవ్రత కనబరుస్తాడో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నపుడూ అలాగే కనిపించాడు" అని గతేడాది వేలంలో సీఎస్కే సొంతం చేసుకున్న లెగ్‌స్పిన్నర్ పీయూష్ చావ్లా తెలిపాడు.
"ప్రతి రోజు రెండు నుంచి మూడు గంటల పాటు నెట్స్‌లో ధోనీ బ్యాటింగ్ సాధన చేసేవాడు. అతను బంతిని కొట్టిన తీరు చూస్తే కొంత విరామం తర్వాత ఆడుతున్నాడని ఎవరూ అనుకోరు. అతను శిక్షణ కొనసాగించిన విధానం మాకు స్ఫూర్తినిచ్చింది. ధోనీ లయ ఏ మాత్రం తప్పలేదు" అని మరో లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ అన్నాడు.
ఉత్తమంగా రాణిస్తాడు
ధోనీ సహజ సిద్ధమైన అథ్లెట్ అని, అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని సీఎస్కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ చెప్పాడు. దాదాపు గత పదేళ్లలో ధోనీ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం తొలిసారి చూశానని, వచ్చే ఐపీఎల్ సీజన్‌లో అతను ఉత్తమంగా రాణించడం కోసం దృష్టి పెట్టాడని చెప్పడానికి ఇది నిదర్శనమని జట్టు ఫిజియో టామీ సిమ్సెక్ వెల్లడించాడు.
ఇదీ చూడండి.. కృనాల్ పాండ్యలో ఉన్న రెండో కోణమేంటో తెలుసా?