ఐపీఎల్-2021 కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ భారత్‌లోనే జరిగే అవకాశాలు మెండుగా ఉండటంతో వారిలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అంతేకాకుండా స్టేడియాల్లోకి 50 శాతం మందికి అనుమతి ఇస్తుండటంతో తమ అభిమాన జట్లకు ప్రత్యక్షంగా మద్దతు తెలపాలని ఊవిళ్లూరుతున్నారు. వారికి మరో శుభవార్త ఏంటంటే ఈ సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచులన్నీ మొతేరాలోనే జరుగుతాయని వినికిడి!
కరోనా మహమ్మారి వల్ల గతేడాది ఐపీఎల్‌ను యూఏఈకి తరలించారు. దుబాయ్, అబుదాబి, షార్జా మైదానాల్లో మ్యాచులు నిర్వహించారు. అక్కడికి వెళ్లేముందు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. సీజన్ జరిగేంత వరకు ఐదు రోజులకు ఒకసారి ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించారు. కఠినమైన బయోబబుల్ ఏర్పాటు చేసి లీగ్‌ను విజయవంతంగా ముగించారు. ఇక అన్ని జట్లు.. అభిమానులను విపరీతంగా అలరించాయి. దిల్లీ జట్టు ఫైనల్ చేరుకొని అబ్బురపరిచింది. ఎప్పటిలాగే ముంబయి ఇండియన్స్ విజేతగా అవతరించి తనను మించిన జట్టే లేదని చాటిచెప్పింది.
తాజా సీజన్‌కు సంబంధించిన వేలం రెండు వారాల క్రితమే ముగిసింది. అన్ని జట్లు తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఆ సమయంలోనే ఈసారి లీగ్‌ను భారత్‌లో నిర్వహిస్తారన్న సమాచారం విస్తృతంగా ప్రచారమైంది. యూఏఈతో పోలిస్తే భారత్‌లోనే కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. మన దేశమే సురక్షితమని భావిస్తున్నారు ట్రోఫీ నిర్వాహకులు. పైగా ఇంగ్లాండ్‌తో సిరీసును విజయవంతంగా నిర్వహిస్తుండటం ఆశలు రేకెత్తిస్తోంది. మహమ్మారి సమస్య పూర్తిగా సమసిపోలేదు కాబట్టి ఐదు వేదికల్లోనే మ్యాచులు జరపాలని ఐపీఎల్ పాలక మండలి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
చెన్నై, కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు, ముంబయిని వేదికలుగా ఎంపిక చేశారని సమాచారం. అయితే ముంబయి వేదిక కోసం మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరారని ఇంకా ధ్రువీకరణ రాలేదని తెలిసింది. అయితే గతంలో మాదిరిగా రోజుకో స్టేడియంలో మ్యాచులు జరగవు. ఒక్కో మైదానంలో ఒకసారి అన్ని జట్లు తలపడతాయి. ఆ తర్వాత వేదిక మారుతుంది. ఇక లీగ్ మ్యాచులు ముగిశాక మొతేరాలో ప్లేఆఫ్స్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే 50% అభిమానులు వచ్చినా 55వేల మంది వస్తారు. పైగా ఇంగ్లాండ్‌తో టీ20లు సైతం ఇక్కడే జరుగుతుండటంతో అందరిలోనూ విశ్వాసం కలుగుతోంది.
ఇదీ చదవండి: ప్రేక్షకులు లేకుండానే కివీస్-ఆసీస్ టీ20లు