ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్.. మరో ఆసక్తికర పోరుకు సిద్ధమవుతోంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియాతో హోరాహోరీగా తలపడనుంది. ఇరు జట్లలోని ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. వారిలో మ్యాచ్ గతిని మార్చే వాళ్లలో ఈ ఐదుగురు ముందు వరుసలో ఉంటారు. అసలు వారెవరు, వారి ప్రత్యేకతలేంటి. వాటిని వివరిస్తూ రాసిన విశ్లేషణాత్మక కథనం.
ఓపెనింగ్ సమస్యను రాయ్ తీరుస్తాడా..!
ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్.. ఇప్పటివరకు ఆడింది ఒక టెస్టు మాత్రమే. ఇటీవలే ఐర్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచే అతడికి మొదటిది. ఆ మ్యాచ్‌లోని మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైనా... రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అదే ఉత్సాహంతో యాషెస్లోకి అడుగుపెట్టనున్నాడు. కొన్నేళ్ల నుంచి ఈ ఫార్మాట్లో ఓపెనింగ్ సమస్యతో బాధపడుతున్న ఇంగ్లీష్ జట్టుకు రాయ్ ప్రదర్శన చాలా కీలకం.
టెస్టుల్లో ఓపెనర్‌గా విశేష ప్రతిభ కనబర్చిన మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్, 2012లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్థానాన్ని భర్తీ చేసే సరైన బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్‌కు దొరకలేదు. ఇప్పుడు రాయ్ ఆ లోటు తీరుస్తాడని భావిస్తోంది ఇంగ్లాండ్.
అందరి చూపు ఆర్చర్‌పైనే...
ప్రఖ్యాత యాషెస్‌తో తన టెస్టు అరంగేట్రం చేస్తున్నాడు యువ సంచలనం జోఫ్రా ఆర్చర్. ప్రపంచకప్ ఫైనల్లోని సూపర్ ఓవర్‌తో ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఇప్పడు సంప్రదాయ క్రికెట్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.
24 ఏళ్ల ఆర్చర్.. ఇప్పటి వరకు 28 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 131 వికెట్లు తీశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొట్టిన ఆర్చర్.. టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. వైవిధ్యమైన బంతులు సంధించే ఆర్చర్.. యాషెస్‌ను ఎలా ఆరంభిస్తాడో చూడాలి.
కింగ్ ఆఫ్ స్వింగ్.. అండర్సన్
జేమ్స్ అండర్సన్.. 148 టెస్టులాడి ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవలే 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి పేస్ దళం బాధ్యతలు పంచుకోనున్నాడు. బంతిని స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి పని పట్టడంలో ఆండర్సన్ దిట్ట. సొంతగడ్డపై యాషెస్ ఆడుతుండటం ఇతడికి అదనపు బలం.
ఇది అండర్సన్కు నాలుగో యాషెస్ సిరీస్. ఇతడ్ని అడ్డుకుంటే ఆస్ట్రేలియా తొలి టెస్టు గెలిచేందుకు మార్గం సుగమం కానుంది.
మరోసారి మెరిసేందుకు వార్నర్ సిద్ధం
గతేడాది బాల్ టాంపరింగ్ ఉదంతంతో సంవత్సరం పాటు నిషేధానికి గురైన వార్నర్.. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించాడు. 647 రన్స్‌తో అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను యాషెస్‌లోనూ కొనసాగించాలని చూస్తున్నాడు.
ఇప్పటి వరకు 74 టెస్టులాడిన వార్నర్.. 48 సగటుతో 6000కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలున్నాయి.
గత యాషెస్‌లో 3-2 తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఈ సిరీస్‌లో ఐదు అర్ధ సెంచరీలు చేసిన వార్నర్.. జట్టును గెలిపించలేకపోయాడు. ప్రస్తుతం పూర్తి ఫామ్‌లో ఉన్న ఈ బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థి బౌలర్లను ఆడుకునేందుకు కసరత్తులు చేస్తున్నాడు.
యార్కర్ల కింగ్ స్టార్క్.. యాషెస్‌కు సిద్ధం
గురువారం నుంచి ప్రారంభం కానున్న యాషెస్‌లో ఆస్ట్రేలియా తరఫున కీలక బౌలర్ మిచెల్ స్టార్క్. ఆసీస్ పేస్ దళాన్ని ముందుండి నడిపించనున్నాడు. ఇతడికి తోడుగా జేమ్స్ పాటిన్సన్, పీటర్ సిడెల్, పాట్ కమిన్స్, జోస్ హేజల్‌వుడ్ తమ అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నారు.
ఇప్పటికి 51 టెస్టులకు ప్రాతినిధ్యం వహించిన స్టార్క్.. 28.20 సగటుతో 200కు పైగా వికెట్లు తీశాడు.
ఇటీవలే జరిగిన మహిళల యాషెస్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఆ జట్టులోని వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అల్యసా హేలీ.. స్టార్క్ సతీమణి కావడం విశేషం. యాషేస్ను గెలిచి తన భార్యకు బహుమతిగా ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నాడు.
ఇది చదవండి: యాషెస్: బూడిద కోసం కొట్లాట