సౌరభ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యాక మొదట శుభాకాంక్షలు చెప్పింది తానేనంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్. "గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక మొదట శుభాకాంక్షలు చెప్పింది నేనే. అతడిని అధ్యక్షుడిగా చేయటం అనేది బీసీసీఐ తీసుకున్న మంచి నిర్ణయం అని భావిస్తున్నా. మేమిద్దరం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే సమయంలో మా మధ్య ఆటకు సంబంధించిన మంచి అవగాహన ఉండేది. గతేడాది ఇద్దరం దిల్లీ జట్టు కోసం పనిచేశాం" అని చెప్పుకొచ్చాడు పాంటింగ్.
"ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 లీగ్ నిర్వహించడానికి బీసీసీఐ గొప్పగా కృషి చేసింది. కొన్ని నెలల క్రితమే దిల్లీ యాజమాన్యంతో మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యాసాధ్యాల గురించి చర్చించా. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధించిన నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇది ఆటగాళ్లకు కొంత ఇబ్బంది కలిగించేదే. ఏదేమైనా అంతా సర్దుకున్నట్లుగానే భావిస్తున్నా."
-పాంటింగ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
ప్రస్తుతం దిల్లీ జట్టుకు పాంటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ విజయం సాధించి ఐపీఎల్లో బోణీ కొట్టింది.