2017 జులై 12.. తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో 40 పరుగులకే కుప్పకూలింది ఆ మహిళా జట్టు.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లోనూ అదే ఫలితం పునరావృతమైంది. ఆ దేశంలో పురుషుల క్రికెట్టే అంతంతమాత్రంగా ఉంది.. ఇక అమ్మాయిలు ఏం ఆడతారులే అనే మాటలు వినిపించాయి.
2019 సెప్టెంబర్ 5.. టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్ సెమీస్‌లో గెలిచిన ఆ జట్టు చరిత్ర సృష్టించింది. తన కంటే మెరుగైన నెదర్లాండ్స్, ఐర్లాండ్ జట్లను వెనక్కి నెట్టి సగర్వంగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
ఈ రెండు సందర్భాల్లో చెప్పుకుంది ఒక్క జట్టు గురించే.. అదే థాయ్‌లాండ్. ఆ దేశంలో అసలు క్రికెట్ ఆడతారా? అని అనుకునే స్థాయి నుంచి అత్యుత్తమ జట్లు పోటీ పడే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఆ జట్టు ప్రయాణం స్ఫూర్తిదాయకం! ఇంకో మూడు రోజుల్లో మొదలయ్యే మహిళల టీ20 ప్రపంచకప్‌లో థాయ్‌లాండ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.
అప్పటి నుంచి...
2007లో ఆ దేశంలో మహిళల క్రికెట్‌కు శ్రీకారం చుట్టారు. సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణులతో పాటు ఆసక్తి ఉన్న అమ్మాయిలకు సెలక్షన్స్ నిర్వహించి ఓ జట్టును సిద్ధం చేసుకున్నారు. వాళ్లకు ఆటలో ఓనమాలు నేర్పించడం, క్రికెట్‌కు తగినట్లు వాళ్లను తయారు చేయడం పెద్ద సవాలే. కానీ క్రికెటర్లు, కోచ్‌లు వెనక్కి తగ్గలేదు. ప్రాథమిక విషయాలను త్వరగానే నేర్చుకున్న ఆ జట్టు.. ఆ ఏడాది జులైలో బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్యదేశాలతోనే మ్యాచ్‌లు ఆడేది. ఏసీసీ నిర్వహించే టోర్నీలో పాల్గొనేది.
కానీ 2013 టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో తొలిసారి పాల్గొని అయిదో స్థానంలో నిలిచిన ఆ జట్టు వెలుగులోకి వచ్చింది. 2015లో తమ దేశంలోనే క్వాలిఫయర్స్‌ను నిర్వహించగా.. అనుకున్న స్థాయిలో రాణించలేదు. 2017లో తొలి వన్డే ఆడింది.
ఆ తర్వాతే...
థాయ్‌లాండ్ క్రికెట్ ప్రయాణంలో 2018 ఏడాది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టీ20ల్లో ఐసీసీ సభ్యదేశంగా గుర్తింపు లభించడం ఆ జట్టు దశను మార్చింది. భారత్‌కు చెందిన హర్షల్ పాథక్ జట్టు కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడం వల్ల ఆట ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ప్రదర్శన బాగుపడింది. ఆసియా కప్‌లో శ్రీలంకపై విజయం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. అక్కడి నుంచి ఆ జట్టు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. వరుసగా 17 విజయాలతో ఆస్ట్రేలియా (16) పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది.
గతేడాది ఆసియా ప్రాంతీయ స్థాయి క్వాలిఫయర్స్‌లో విజేతగా నిలిచిన ఆ జట్టు.. టీ20 ప్రపంచకప్ ప్రధాన క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. ఆస్ట్రేలియాలో శుక్రవారం ఆరంభమయ్యే ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ అత్యుత్తమ క్రికెటర్లతో ఆడడం ఆ జట్టుకు కచ్చితంగా మేలు చేస్తుంది. ఈ అనుభవం భవిష్యత్‌లో ఆ జట్టుకు ప్రయోజనాలను అందిస్తుందనడంలో సందేహం లేదు.
- థాయ్‌లాండ్ కెప్టెన్ సోర్నరిన్ టిపోచ్ మొదట సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి. ఆ తర్వాత క్రికెట్‌కు మారింది. మొదటి నుంచి జట్టుకు కెప్టెన్ బాధ్యతను ఆమే ఉండేది. జట్టు ప్రదర్శన మెరుగవడంలో తనది కీలక పాత్ర.
- థాయ్‌లాండ్ టీ20 స్మాష్ లీగ్ ద్వారా ఆ జట్టు క్రికెటర్లు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. చవాయ్, చత్నమ్ లాంటి క్రికెటర్లు భారత క్యాంపులో శిక్షణ పొందుతూ మెలకువలు ఒంటపట్టించుకుంటున్నారు.
- హైదరాబాద్ మాజీ క్రికెటర్లు వెంకటపతి రాజు, విద్యుత్ జైసింహా థాయ్‌లాండ్ జట్టుకు కోచ్‌లుగా పనిచేశారు.
ఇదీ చూడండి.. 'కంబళ వీరుడు' శ్రీనివాస గౌడకు సీఎం సత్కారం