ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (156) చేసిన పాకిస్థాన్ ఓపెనర్ షా మసూద్ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 14 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం 19వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. బాబర్ అజామ్ 6వ ర్యాంకులో ఉన్నాడు. అలాగే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బట్లర్, క్రిస్ వోక్స్ కూడా వారి స్థానాలను మెరుగుపర్చుకున్నారు. బ్యాట్స్‌మెన్ విభాగంలో వోక్స్ 18 స్థానాలు ఎగబాకి 78వ ర్యాంకుకు చేరుకున్నాడు. అలాగే ఆల్‌రౌండర్ల విభాగంలో 7వ స్థానానికి ఎగబాకాడు. బట్లర్ 44 నుంచి 30కి చేరాడు.
బౌలర్ల విభాగంలో పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా, షాదాబ్ ఖాన్ వారి ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు. షా 22వ ర్యాంకులో ఉండగా.. షాదాబ్ 69వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ మూడో స్థానంలో కొనసాగుతుండగా ఆర్చర్ 37వ ర్యాంకుకు చేరుకున్నాడు.
అలాగే టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఇండియా (360 పాయింట్లు) టాప్‌లో కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో సిరీస్, పాక్‌తో తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్ 266 పాయింట్లతో మూడో ర్యాంకుకు చేరుకుంది. ఆస్ట్రేలియా 296 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉంది.