పాకిస్థాన్ క్రికెట్‌తో పాటు క్రీడాప్రపంచాన్ని నివ్వెరపరిచిన లాహోర్ బాంబు దాడి జరిగి నేటికి సరిగ్గా 10 సంవతర్సాలు అవుతోంది. ఘటన తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తుందని మృత్యు ఒడిలోంచి బయటపడ్డ అంపైర్ అహ్సన్ రజా తెలిపాడు.
అది 2009,మార్చి 3 .. పాకిస్థాన్-శ్రీలంక మధ్య రెండో టెస్టుకు రిజర్వు అంపైర్‌గా ఉన్నాడు రజా. ఇతర మ్యాచ్ అధికారులతో కలిసి బస్సులో స్టేడియానికి వెళుతున్నాడు. ఒక్కసారిగా మిలిటెంట్లు ఫైరింగ్‌కు తెగబడ్డారు. ఆ ఘటనలో 8 మంది చనిపోగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. రెండు బుల్లెట్లు రజా ఊపిరితిత్తులు, కాలేయంలోకి దూసుకెళ్లాయి. 6 నెలల తర్వాత ఆయన కోమాలోంచి కోలుకున్నారు.
ఆ ఘటన తర్వాత పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడటానికి ఏ దేశం ధైర్యం చేయలేదు. దశాబ్ద కాలం గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ పర్యటించడానికి ఆటగాళ్లు ఆసక్తి చూపడం లేదు.
పాక్ తమ మ్యాచ్‌లకు యూఏఈని వేదికగా ఎంచుకుంది. దీని ద్వారా ఏటా 20 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. స్టార్ ఆటగాళ్లతో నిండిన పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లోని కొన్ని మ్యాచ్‌లను స్వదేశంలో జరుపుతోంది.
లాహోర్ స్టేడియంలో 2017లో పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ని పటిష్ఠ బందోబస్తు మధ్య నిర్వహించారు. 'వరల్డ్ ఎలెవన్' జట్టు కూడా అక్కడ 3 టీ20 మ్యాచులు ఆడింది. దాడి జరిగిన 8 సంవత్సరాలకు ఆ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. అక్టోబర్ 2017లో శ్రీలంకతో ఒక టీ20 మ్యాచ్ నిర్వహించారు.
లాహోర్ మైదానంలో మ్యాచ్‌లు నిర్వహించడానికి పీసీబీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. త్వరలోనే మరిన్ని దేశాలు పాక్ పర్యటనకు తమ దేశానికి వస్తాయంటున్నారు అధికారులు.
గత మేలో వెస్టిండీస్ పాక్ పర్యటనకు వచ్చి కరాచీలో మూడు టీ20లు ఆడింది. పీఎస్ఎల్లో మిగిలిన 8 మ్యాచులు (ఫైనల్‌తో కలిపి ) లాహోర్, కరాచీలో జరగబోతున్నాయి. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మ్యాచ్‌లు యథావిధిగా జరుగుతాయని పీసీబీ ప్రకటించింది.
వీలైనన్ని ఎక్కువ పీఎస్ఎల్ మ్యాచ్‌లు పాక్‌లో నిర్వహించడం వల్ల ఇతర దేశాలకు నమ్మకం కలుగుతుందని పాక్ క్రికెట్ మాజీ కెప్టెన్ అసిఫ్ ఇక్బాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇది నెమ్మదిగా, దీర్ఘకాలికంగా జరిగే ప్రక్రియని.. ప్రస్తుతానికి కొన్ని దేశాలు సానుకూలంగా లేవని అన్నాడు.
గతేడాది పాక్‌లో టీ20 సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ విముఖత వ్యక్తం చేసింది. రెండు వన్డేలు ఆడాలన్న ప్రతిపాదనను ఆస్ట్రేలియా తిరస్కరించింది. అక్టోబర్‌లో శ్రీలంకతో పాక్ రెండు టెస్టులు ఆడనుంది. శ్రీలంక పర్యటనతో ఇతర దేశాలూ పాక్ పర్యటనకు వస్తాయని పీసీబీ ఆశిస్తోంది.