శ్రీలంక పర్యటనకు ఎంపికైన 16 మంది దక్షిణాఫ్రికా క్రికెటర్లలో శుక్రవారం 10 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ వారం ప్రారంభమైన దేశవాళీ క్రికెట్లో పాల్గొన్న వారికి కొవిడ్ సంక్రమించడం వల్ల ఈ మ్యాచ్లను నిలిపేస్తున్నట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా తెలిపింది. సౌతాఫ్రికాలో ప్రస్తుతం కరోనా రెండో దశ ప్రారంభమైన నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన దేశవాళీ టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.
దక్షిణాఫ్రికా దేశవాళీ టోర్నీలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం డాల్ఫిన్స్, టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఐదురుగు ఆటగాళ్లకు కరోనా సోకడం వల్ల ఆ మ్యాచ్ను నిలిపేశారు. ఆ తర్వాత బుధవారం ఈగల్స్, లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ మరో ఐదుగురు టెస్టు ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు. మొత్తం 10 మంది ఆటగాళ్లకు మహమ్మారి బారిన పడగా.. మిగిలిన ఆరుగురిలో కెప్టెన్ క్వింటన్ డికాక్, మాజీ కెప్టెన్ డుప్లెసిస్, బవుమా, కైల్ వెరియన్నే.. ఫాస్ట్ బౌలర్లు ఎన్రిచ్ నోర్ట్జే, గ్లెంటన్ స్టుర్మన్లు ఉన్నారు.
దక్షిణాఫ్రికా వేదికగా డిసెంబరు 26 నుంచి శ్రీలంక, సఫారీల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కావాల్సింది. ఆటగాళ్లందరూ బయోబబుల్లోకి ప్రవేశించే ముందు అందర్నీ పరీక్షించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టు శనివారం సమావేశమవుతుందని సెలెక్టర్ల కన్వీనర్ విక్టర్ ఎంపిట్సాంగ్ తెలిపారు.
ఇదీ చూడండి: పేరు, జెండా లేకుండానే ఒలింపిక్స్లో రష్యా