టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రిని మరోసారి ఎంపికచేసింది క్రికెట్ సలహా కమిటీ. ఇంకా సహాయక సిబ్బంది ఎవరనేది తెలియాల్సి ఉంది. సోమవారం వీరి ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని కమిటీ. ఆ బాధ్యతలు చేపట్టే వారి పేర్లను గురువారం ప్రకటించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
"సహాయక సిబ్బంది ఎంపిక ప్రక్రియ సోమవారం నుంచి గురువారం వరకు కొనసాగుతుంది. అదే రోజు సెలక్ట్ అయిన వారి పేర్లు ప్రకటిస్తాం".
-బీసీసీఐ అధికారి
కోచ్ ఎంపిక బాధ్యతను చూసుకున్న క్రికెట్ సలహా కమిటీ.. సహాయక సిబ్బంది ఎంపిక ప్రక్రియకు దూరంగా ఉండనుంది. బీసీసీఐలో పొందుపర్చిన కొత్త నిబంధన ప్రకారం క్రికెట్ సలహా కమిటీ కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉండగా.. సహాయక సిబ్బంది నియామకాన్ని సెలక్షన్ కమిటీ చూసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం బౌలింగ్ కోచ్‌గా ఉన్న భరత్ అరుణ్‌కు మరో అవకాశం దక్కే వీలుంది. కొంత కాలంగా టీమిండియా పేస్ బౌలింగ్‌లో గణనీయమైన పురోగతి రావడమే ఇందుకు కారణం.
ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌ను తొలిగించే అవకాశమూ తక్కువే. భారత ఆటగాళ్లు ఫీల్డింగ్ విషయంలో ప్రపంచస్థాయిలో రాణిస్తున్నారు. ఈ పదవికి దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ దరఖాస్తు చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య గట్టిపోటీ ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్ పదవి ఉంటుందన్న నమ్మకం లేదు. ప్రపంచకప్ తర్వాత ఇతడిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరోసారి కొనసాగించే అవకాశం లేదని సమాచారం. నాలుగో స్థానం బ్యాటింగ్‌పై ఇంతవరకు స్పష్టత రాకపోవడమూ ఓ కారణం. ఈ పదవికి టీమిండియా మాజీ ఆటగాళ్లు ప్రవీణ్ ఆమ్రే, విక్రమ్ రాథోర్ దరఖాస్తు చేసుకున్నారు. మరి అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఇది చదవండి: ఫుట్‌బాల్ కథతో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ