టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఎంత గొప్ప బ్యాట్స్‌మనో అందరికీ తెలిసిందే. అతడికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆడాలో బాగా తెలుసు. ఛేదనలో కింగ్ కోహ్లీగా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచంలో ఏ జట్టు మీదైనా అలవోకగా పరుగులు సాధించగలడు. అయితే, భారత సారథి అంతలా విజయవంతం అవ్వడానికి.. అతడు కష్టపడే విధానమే కారణమని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అభిప్రాయపడ్డాడు.
"కోహ్లీలో ఉన్న మంచి గుణం ఏమిటంటే ఆటపట్ల అతడికున్న అంకితభావం. ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్‌గా ఉండాలని ఇష్టపడతాడు. అందుకోసం ఎంతో కష్టపడతాడు. నేను చూసిన వారిలో అత్యంత కష్టపడే క్రికెటర్ అతడే. అది కాకుండా పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం తనకున్న పెద్దబలం. కోహ్లీ ఎప్పుడూ ఒకేలా ఆడే ఆటగాడు కాదు. పరిస్థితులను బట్టి ఆటను మార్చుకోగలడు. ప్రతి ఫార్మాట్‌నూ ప్రత్యేకంగా ఆడతాడు. అతడి బలాల్లో అదీ ఒకటి. అందుకు ఉదాహరణ 2016 ఐపీఎల్. ఆ సీజన్‌లో నాలుగు శతకాలు బాదాడు. అందులో 40 సిక్సులు కొట్టాడు. అప్పుడు చాలా మంచి ఫామ్‌లో కొనసాగాడు. ఆ తర్వాత టీమ్‌ఇండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఇక్కడ రెండు నెలలు అద్భుతంగా చెలరేగిన అతడు అక్కడకెళ్లి ఇంకా బాగా ఆడాడు. తొలి టెస్టులోనే ద్విశతకం బాదాడు. అయితే, ఆ మ్యాచ్‌లో ఒక్క బంతికి కూడా గాల్లోకి కొట్టలేదు. ఫార్మాట్‌ను బట్టి బ్యాటింగ్‌ను మార్చుకోవడం అందరు ఆటగాళ్లకు చేతకాదు. విరాట్ మాత్రమే ఎలా ఆడాలనుకుంటే అలా ఆడగలడు. పరిస్థితులను బట్టి బ్యాటింగ్ చేస్తాడు. అదే అతడి బలం" అని వివరించాడు విక్రమ్ రాథోడ్.