టీ20 ప్రపంచకప్‌నకు నాలుగు నెలల ముందుగానే తుది జట్టు సిద్ధమవ్వాలని అన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్. వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ కూడా అతడి వ్యాఖ్యలతో ఏకీభవించాడు. దూబే లాంటి ప్రతిభ ఉన్న ఆల్‌రౌండర్‌కు మరిన్ని అవకాశాలివ్వాలని కోరారు ఈ ఇద్దరు సీనియర్లు.
" ప్రపంచకప్‌నకు నాలుగు నెలల ముందుగానే జట్టు సిద్ధమైపోవాలి. 14 లేదా 16 మందితో అయినా పర్లేదు. యువ క్రికెటర్ శివమ్ దూబేను ఎంపిక చేయడం నచ్చింది. అతడు ఎడమచేతి వాటం ఆటగాడు కావడం జట్టుకు మరింత బలం. బౌలింగ్ కూడా చేయగలడు. ఎందుకంటే హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు".
- యువరాజ్, టీమిండియా మాజీ క్రికెటర్
తెలియకపోతే ఎలా..?
ప్రపంచకప్ ఆడబోతున్నట్టు ఆటగాళ్లకు తెలియాలని చెప్పిన భజ్జీ... అందుకు జట్టు ముందుగానే సిద్ధమవ్వాలని అభిప్రాయపడ్డాడు.
" ఆటగాళ్లకు జట్టులో చోటు దొరుకుతుందా లేదా అన్న సందేహం వారికి ఉండొద్దు. జట్టులో వారి స్థానం, పాత్రపై కచ్చితత్వం ఉండాలి. మరింత స్పష్టత ఉంటే సన్నాహకం మరింత స్పష్టంగా ఉంటుంది. శివమ్ దూబేపై ఎక్కువ విమర్శలు ఉన్నాయి. అతడు వేసిన ఓవర్లే కాకుండా మిగతా బౌలర్లు పొరపాట్లు చేశారు కదా. అర్హత ఉన్న ఆటగాళ్లకు నిరూపించుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. ఇతర ఆటగాళ్లకు 15 అవకాశాలు ఇచ్చినట్టుగా అతడికీ అవకాశాలు ఇవ్వాలి"
- హర్భజన్ సింగ్, సీనియర్ బౌలర్
ప్రపంచకప్ షెడ్యూల్ ఇదే...
ఆస్ట్రేలియా వేదికగా 2020లో పురుషుల టీ20 వరల్డ్ కప్ నిర్వహించనుంది ఐసీసీ. ఇందులో భాగంగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్న కఠినమైన గ్రూప్ 2లో కోహ్లీ సేనను చేర్చారు. ఈ గ్రూప్‌లో ఆ మూడు జట్లతోపాటు మరో రెండు అర్హత సాధించే జట్లు ఉండనున్నాయి. దక్షిణాఫ్రికాతో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. పురుషుల ప్రపంచకప్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మెల్‌బోర్న్ స్టేడియంలో జరగనుంది.
గ్రూప్ 1 : పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, రెండు అర్హత సాధించిన జట్లు.
గ్రూప్ 2 : భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, రెండు అర్హత సాధించిన జట్లు
క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు అక్టోబర్ 18 నుంచి 23 వరకు జరగనున్నాయి. గ్రూప్ మ్యాచ్‌లు అక్టోబర్ 24-నవంబర్ 8 తేదీల్లో నిర్వహించనున్నారు. సెమీ ఫైనల్స్ నవంబర్ 11, 12 తేదీల్లో... ఫైనల్ నవంబర్ 15న జరగనుంది.