డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 8 నెలల నిషేధం ఎదుర్కొన్నాడు యువ క్రికెటర్ పృథ్వీషా. ఈ నెల 15తో అది పూర్తి కానుంది. తద్వారా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో(జాతీయ టీ20) బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న షా... ముంబయి ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని సమాచారం. ఈనెల 15తో పృథ్వీపై నిషేధం తొలగిపోతుందని ఆ తర్వాత అతడికి జట్టులో చోటివ్వడంపై ఆలోచిస్తామని ఆ జట్టు చీఫ్ సెలక్టర్ మిలింద్ రెగే చెప్పాడు.
" నవంబర్ 16 నుంచి పృథ్వీపై నిషేధం తొలగిపోతుంది. ఆ తర్వాత అతడిని జట్టులోకి తీసుకునే విషయమై ఆలోచిస్తాం. ప్రస్తుతం షా ఫిట్‌గానే ఉన్నాడు. అయితే ఎంపిక విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేం."
--మిలింద్ రెగే, ముంబయి ప్రధాన కోచ్
ప్రస్తుతం ముంబయి టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్. మొదటి మ్యాచ్‌లో మిజోరాంపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది ముంబయి. ఈనెల 17న అసోంతో మ్యాచ్ ఆడనుంది. ఆ పోరులో పృథ్వీ బరిలోకి దిగే అవకాశముందని సమాచారం.
ఇదీ జరిగింది...!
గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో దగ్గుతో బాధపడుతున్న షా.. బోర్డుకు చెప్పకుండా ఓ దగ్గుమందు ఉపయోగించాడు. అందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉంది. ఈ కారణంతోనే పృథ్వీపై వేటు పడింది. ఇలానే మరో ఇద్దరు క్రికెటర్లు 6-8 నెలలు మైదానంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించింది బీసీసీఐ.