ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌కు త్వరలోనే టీమ్‌ఇండియా పిలుపు వస్తుందని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ నిరాశపర్చడం వల్ల.. ఆ ముంబయి బ్యాట్స్‌మెన్ భారత జట్టుకు ఎంపికవ్వడానికి ఎంత దూరంలో ఉన్నారని ఓ నెటిజన్ చోప్రాను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన మాజీ క్రికెటర్ అదెంతో దూరంలో లేదన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వచ్చిన అవకాశాన్ని సంజూ సద్వినియోగం చేసుకోలేదని, శ్రేయస్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదని బదులిచ్చాడు.
"మనీష్ పాండే కూడా స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. దాన్ని బట్టి ఇషాన్, సూర్య త్వరలోనే టీమ్‌ఇండియాకు ఎంపికయ్యే అవకాశం ఉంది. అది కూడా ఇంగ్లాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎంపికవుతారని అనుకుంటున్నా. 2020 ఐపీఎల్‌లో ఆడినట్లే వచ్చే సీజన్‌లోనూ వారిద్దరు చెలరేగితే కచ్చితంగా టీమ్‌ఇండియా తరఫున ఆడతారు."
-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత
గత నెల యూఏఈలో పూర్తయిన ఐపీఎల్‌లో ఇషాన్ 4 అర్ధశతకాలతో 516 పరుగులు చేయగా, సూర్యకుమార్ అన్నే హాఫ్ సెంచరీలతో 480 పరుగులు చేశాడు. ఇక అదే సమయంలో ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ టీమ్‌ఇండియాను 3 జట్లుగా ప్రకటించగా సూర్య తనకు అవకాశం వస్తుందని భావించాడు. కానీ అలా జరగలేకపోవడం వల్ల అతడు బాధపడ్డాడు.