భారత్ నుంచి లాభం పొందేందుకు చైనాకు ఎలాంటి అర్హత లేదని అన్నాడు టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఓ వార్తఛానెల్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"ప్రభుత్వం ఈ విషయంలో సరైనా నిర్ణయం తీసుకుంటుందని నమ్ముతున్నా. మన సైనికులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. వారి మరణం గురించి నేను ఇలా మాట్లాడుతన్నా.. వారి కుటుంబాలకు ఇది ఎంత కష్టమో తెలుసు"
సురేశ్ రైనా, భారత సీనియర్ క్రికెటర్
ఎత్తుగడతోనే వస్తున్న చైనా
తాను కూడా సైనిక కుటుంబం నుంచే వచ్చానని చెప్పిన రైనా.. భారత ఆర్మీ ఎంతో ధృఢంగా ఉందని, ప్రతి ఒక్క సైనికుడికి సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పాడు. తొలుత కరోనా వైరస్, ఇప్పుడు సరిహద్దు వివాదాలు చూస్తుంటే.. చైనా ఏదో ఎత్తుగడ వేస్తున్నట్లుగా అనిపిస్తోందని అన్నాడు.
మరోవైపు ఐపీఎల్లో చైనా కంపెనీల స్పాన్సర్షిప్ ఒప్పందాలపై, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వచ్చే వారంలోపు సమీక్ష నిర్వహించనుంది. దీని గురించి మాట్లాడిన రైనా.. "స్పాన్సర్షిప్ల విషయమై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. దేశం గర్వించేలా ఆడటమే మా కర్తవ్యం. ప్రధాని మమ్మల్ని అడిగితే, సరిహద్దుల్లోని సైనికులకు సాయం చేసేందుకు కచ్చితంగా వెళ్తాం. దేశం మొత్తం వారికి మద్దతుగా ఉందని ప్రతి సైనికుడు తప్పనిసరిగా తెలుసుకోవాలి" అని స్పష్టం చేశాడు.
ఇదీ చూడండి:'భారత్తో సిరీస్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా'