సీనియర్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వకపోవడానికి గల కారణాన్ని వివరించాడు మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. దేశవాళీల్లో అనుకున్నంత మేర పరుగులు చేయకపోవడమే, జాతీయ జట్టులో చోటు దక్కకపోవడానికి కారణమని అన్నాడు.
"జాతీయ జట్టుకు దూరమైన తర్వాత దేశవాళ్లీ రైనా ఏమంత బాగా రాణించలేదు. 2018-19 రంజీ సీజన్లో అతడి ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అదే ఏడాది ఐపీఎల్లో మోస్తరుగా బ్యాటింగ్ చేశాడు. 1999లో వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియాలో చోటు కోల్పోయినపుడు దేశవాళీల్లో అదరగొట్టి, తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. సీనియర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి" -ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా మాజీ ఛీప్ సెలక్టర్
2018లో చివరగా ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఆడిన రైనా.. ఆ తర్వాత మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అనంతరం తనను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లు, కనీస సమాచారం ఇవ్వలేదని ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశాడు. 33 ఏళ్ల ఇతడు.. టీమిండియాకు 226 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగానూ ఉన్నాడు.