బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శులుగా తమ పదవీ కాలాలు పెంచాలని సౌరభ్ గంగూలీ, జై షాలు వేసిన పిటిషన్‌ను.. విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. మార్చి 23న.. జస్టిస్ ఎల్ నాగేశ్వర్ రావు, జస్టిస్ ఎల్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను పరిశీలించనుంది.
ముగిసిన పదవీకాలం..
గతేడాది అక్టోబరు 23న గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. ఆ పదవిలో 278 రోజులు మాత్రమే కొనసాగాల్సి ఉంది. ఎందుకంటే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బంగాల్ (సీఏబీ)లో 2014లో కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ పదవీకాలాన్ని బీసీసీఐ అధ్యక్ష పదవికి చేర్చగా.. గతేడాడి జులై 26తో అతని పదవీకాలం పూర్తయ్యింది.
కొన్ని వార్తాపత్రికల నివేదికల ద్వారా బీసీసీఐ కార్యదర్శి జై షా.. 2013 సెప్టెంబరు 8న గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. దీంతో పాటు బీసీసీఐ పదవీకాలంతో సంబంధం ఉన్న కారణంగా.. జై షా పదవీకాలం కూడా కొన్ని నెలల క్రితమే పూర్తయ్యింది.
గరిష్ఠంగా ఆరేళ్లు..
కొత్త బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఆఫీస్-బేరర్లైన.. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, కోశాధికారులు వరుసగా ఆరేళ్ల పాటు పదవీకాలాలు పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్ల పాటు కూలింగ్ ఆఫ్ పీరియడ్‌లోకి వెళ్తారు. అయితే ఈ నిబంధన బీసీసీఐతో పాటు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు వర్తిస్తుంది.
మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ తర్వాత తిరిగి పదవి చేపట్టడానికి అర్హులు. లోథా కమిటీ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి బీసీసీఐలో గరిష్ఠంగా తొమ్మిదేళ్లు, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో మరో తొమ్మిదేళ్లు ఆఫీసు బేరర్‌గా పనిచేయొచ్చు. కొత్త రాజ్యాంగంలోని ఏడు కీలకమైన నియమాల మార్పులలో ఇదొకటి. ఇది సవరిస్తే ప్రస్తుత ఆఫీసు బేరర్లను కొనసాగించడానికి అనుమతిస్తుంది.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లోకి సెరెనా