మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడి ఆరు నెలలు దాటింది. ప్రపంచకప్ సెమీస్ తర్వాత మహీ మైదానంలోకి అడుగుపెట్టింది లేదు. ఈ అంశంపై సర్వత్రా చర్చకొనసాగుతూనే ఉంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. ఇన్ని రోజులు క్రికెట్‌కు దూరంగా ఉండవచ్చా అంటూ ధోనీని ప్రశ్నించాడు.
"ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది. భారత్‌కు ఆడకుండా ఇన్ని రోజులు ఎవరైనా దూరంగా ఉంటారా? ఈ ప్రశ్నలోనే జవాబుంది. ఫిట్నెస్ సమస్య ఏదైనా ఉంటే నేమేమి మాట్లడను. ఈ ప్రశ్న మహీ తనకు తాను వేసుకోవాలి. జులై 10 నుంచి అతడు టీమిండియాకు దూరంగా ఉన్నాడు" -సునీల్ గావస్కర్, టీమిండియా క్రికెటర్.
మ్యాచ్ ఫీజుల విషయంలో ఐపీఎల్‌తో పోల్చితే రంజీట్రోఫీ చాలా వెనకబడి ఉందని తెలిపాడు గావస్కర్.
"రంజీ ట్రోఫీతో పోలిస్తే మ్యాచ్ ఫీజుల్లో ఐపీఎల్‌దే ఆధిపత్యం. మ్యాచ్ ఫీజులు పెంచే వరకు ఈ సమస్య ఇలాగే ఉంటుంది. బీసీసీఐ ఆదాయంలో 26 శాతం ఆటగాళ్లకు ఖర్చు చేస్తారు. అందులో 13 శాతం అంతర్జాతీయ క్రికెటర్లకు, 10 శాతం దేశవాళీ క్రికెట్‌కు, 1.5 శాతం జూనియర్ స్థాయికి, 1.5 శాతం మహిళా క్రికెట్‌కు కేటాయిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇలాగే కొనసాగుతుంది. ఈ అంశంపై గంగూలీ దృష్టిపెడతాడని నేను ఆశిస్తున్నా." - సునీల్ గావస్కర్, టీమిండియా మాజీ క్రికెటర్.
ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓటమి తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టలేదు ధోనీ. ఆ తర్వాత ఆర్మీలోనూ కొన్ని రోజులు పనిచేసిన మహీ... కొన్నిసార్లు యువ క్రికెటర్లతో కలిసి కనిపించాడు. పలువురు క్రీడాకారులను కలిశాడు.
అయితే అతడి క్రికెట్ భవితవ్యంపై మాత్రం ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అతడి కెరీర్‌పై నిర్ణయం, ఐపీఎల్ తర్వాత తేలుతుందని పలువురు క్రికెటర్లు వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికే అంశంపై స్పందించిన ధోనీ... వచ్చే జనవరి తర్వాతే ఈ విషయంపై మాట్లాడతానని అన్నాడు. ప్రస్తుతం తాత్కాలిక విరామంలో ఉన్న మహీ... వచ్చే ఏడాది ఐపీఎల్లో మాత్రం ఆడనున్నాడు.
ఇదీ చదవండి: రెండు దశాబ్దాల మెరుపు.. లారెస్ పురస్కార రేసులో సచిన్