టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. తాను గాయం నుంచి ఎందుకు కోలుకోలేదనే విషయంపై ఇప్పుడు ఆలోచిస్తుండొచ్చని భారత మాజీ సారథి సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. ఓ క్రీడా ఛానెల్‌తో గావస్కర్, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు గ్రేమ్ స్వాన్‌లు చర్చలో పాల్గొన్నారు. జడ్డూ స్థానంలో టెస్టుల్లోకి వచ్చిన యువ స్పిన్నర్ అక్షర్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. దీంతో.. ప్రస్తుతం జడేజా టీమ్‌లోకి వచ్చే అవకాశముందా? అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు గావస్కర్ స్పందించాడు.
'తన చేతి వేలికి ఏమైందనే విషయంపై జడేజా ఇప్పుడు ఆలోచిస్తుండొచ్చు. ఇన్ని రోజులు గడుస్తున్నా.. గాయం ఎందుకు నయం కాలేదని వైద్యుడిని అడుగుతుండవచ్చు. సిడ్నీ టెస్టు సందర్భంగా జనవరి 10న అతడికి గాయమైంది. ఇప్పుడు ఫిబ్రవరి గడిచిపోయింది. ఇన్ని రోజులైనా ఇంకా ఎందుకు కోలుకోలేదోనని జడ్డూ ఆశ్చర్యపోతుండొచ్చు' అని బ్యాటింగ్ దిగ్గజం పేర్కొన్నాడు. ఇక స్వాన్ మాట్లాడుతూ.. 'నేను జడ్డూకు వీరాభిమానిని. ఇప్పటికే అక్షర్ ఎలా ఆడుతున్నాడో చూశాం. ఇప్పుడతడికి ఒక వారం విశ్రాంతినిచ్చి జడ్డూకు అవకాశమివ్వాలి. ఎందుకంటే అక్షర్ నుంచి తగినంత మంచి ప్రదర్శన మనం చూశాం' అని వివరించాడు.
ఇక అక్షర్ గురించి మాట్లాడిన గావస్కర్.. "గత రెండు టెస్టుల్లో పిచ్ అతడికి సహకరించింది. అయితే, తనకు వచ్చిన అవకాశాన్ని ఈ యువ స్పిన్నర్ బాగా ఉపయోగించుకున్నాడు. తన శక్తిమేరకు బాగా బౌలింగ్ చేశాడు.. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు సంధించడంతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఆ క్రమంలోనే పలువురు బ్యాట్స్‌మెన్ వికెట్ల ముందు దొరికిపోయారు" అని తెలిపాడు.
చెన్నై టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన అక్షర్ తొలి మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక పింక్‌బాల్ టెస్టులో అయితే 11 వికెట్లతో సత్తా చాటాడు. అంతేకాక మూడో టెస్టులో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్‌గా ట్రెస్కోథిక్