టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు తనను ఏమాత్రం ప్రభావితం చేయవని, తన గురించి ఏమైనా అనుకోవచ్చని ఆస్ట్రేలియా సారథి టిమ్‌పైన్ అన్నాడు. మూడో టెస్టు చివరి రోజు భారత బ్యాట్స్‌మన్ రవిచంద్రన్ అశ్విన్(39*), హనుమ విహారి(21*) బ్యాటింగ్ చేస్తుండగా, పైన్ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. అశ్విన్‌ను అతడు దూషించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడం వల్ల అదే రోజు గావస్కర్ స్పందించాడు. ఆసీస్ కెప్టెన్‌గా పైన్ రోజులు దగ్గరపడ్డాయన్నాడు. ఈ మ్యాచులో పైన్ ప్రవర్తన బాగోలేదని, కొన్ని క్యాచ్‌లు కూడా వదిలేశాడని గావస్కర్ విమర్శించాడు.
అయితే బ్రిస్బేన్ టెస్టు ముందు మీడియా సమావేశంలో ఓ విలేకరి ఇదే విషయాన్ని టిమ్‌పైన్‌తో ప్రస్తావించాడు. 'గావస్కర్ మాటలు విన్నారా' అని అడిగాడు. దానికి ఆస్ట్రేలియా కెప్టెన్.. 'సన్నీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. అవి నాపై ప్రభావం చూపవు. కాబట్టి ఆయన ఏం అనాలనుకున్నా అనుకోవచ్చు. దాంతో నేను చేసేదేం లేదు. నా కెరీర్ మొత్తం మంచి ప్రదర్శన చేశాను. కానీ, సిడ్నీ టెస్టులో అలా జరిగిపోయింది' అని బదులిచ్చాడు.
అయితే, ఈ వివాదాన్ని కొనసాగిస్తారా అని అడిగిన ప్రశ్నకు 'నేను నాలానే ఉంటాను. ఇప్పటికి ఎన్ని టెస్టులు ఆడానో తెలీదు.. కానీ, ఆడినన్ని మ్యాచులు మంచి ఉద్దేశంతోనే ఆడాను. ఇక సిడ్నీలో జరిగింది వేరు. నేనెప్పుడు ఆరోగ్యకరమైన పోటీని ఇష్టపడతా. అయితే, స్టంప్‌మైక్‌ను దృష్టిలో పెట్టుకొని అందరినీ గౌరవించాలి' అని పైన్ వెల్లడించాడు. అలాగే సిడ్నీలో పలు క్యాచ్‌లు వదిలేయడంపై స్పందించిన పైన్ అందుకు రెండు కారణాలున్నాయని చెప్పాడు. ఒకటి తాను కంగారు పడి క్యాచ్‌లు వదిలేశానని, ఇంకొకటి టెక్నికల్ సమస్యలతో వదిలేశానని సమర్థించుకున్నాడు.
అదో అనవసరపు వివాదం
స్టీవ్‌స్మిత్ ఉదంతంపై స్పందిస్తూ 'అదో అనవసరపు వివాదం' అని వ్యాఖ్యానించాడు. అతడు రిషభ్‌పంత్ బ్యాటింగ్ గార్డ్‌ను చెరిపేయలేదని అన్నాడు. గత మూడేళ్లుగా స్మిత్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో అందరికీ తెలుసన్నాడు. బాల్ టాంప్‌రింగ్ వివాదం తర్వాత ఏడాది పాటు నిషేధానికి గురై తిరిగి జట్టులోకి వచ్చినప్పటి నుంచీ అతడు ఇలాంటి వివాదాలు ఎదుర్కొంటున్నాడని పైన్ వివరించాడు. స్మిత్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడని, తనపై వచ్చే విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడని చెప్పాడు. ఇక గబ్బా టెస్టులోనూ స్మిత్ చెలరేగిపోతాడని ఆసీస్ కెప్టెన్ ధీమా వ్యక్తం చేశాడు.
అలాంటిదేమీ వినలేదే!
బ్రిస్బేన్ వేదికగా జరగబోయే నాలుగో టెస్టు కోసం ఆసీస్-భారత్ ఆటగాళ్లు కఠిన క్వారంటైన్, బయోబుడగలో ఉంటున్నారు. అయితే టీమ్‌ఇండియా ఆటగాళ్లు బస చేస్తోన్న హోటల్లో సౌకర్యాలు సరిగ్గా లేవని ఇటీవల బీసీసీఐ.. ఆసీస్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయంపై స్పందించిన ఆసీస్ సారథి టిమ్ పైన్.. భారత ఆటగాళ్ల నోటి నుంచి నేరుగా అలాంటి వ్యాఖ్యలు తానేమీ వినలేదని అన్నాడు. "ఈ విషయానికి సంబంధించి భారత ఆటగాళ్లు నేరుగా నాతో ఏమీ మాట్లాడలేదు. వారి నోటి వెంట ఆ వ్యాఖ్యలను నేను వినలేదు. తమ కుటుంబాలను విడిచి వేరే దేశం వచ్చి ఆడాలంటే ఏ ఆటగాడికైనా సవాల్ లాంటిదే. వారు పడే కష్టాలని నేను అర్థం చేసుకోగలను. ఐపీఎల్ కోసం భారత్‌కు వెళ్లినప్పుడు అవే బాధలను మా ఆటగాళ్లు స్మిత్, కమిన్స్ కూడా పడ్డారు." అని అన్నాడు.
ఇదీ చూడండి :