ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడటం తన కెరీర్లో పెద్ద మలుపని అన్నాడు టీమ్ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్. కీలక ఓవర్లలో ఒత్తిడిని తట్టుకుంటూ బౌలింగ్ చేయడం సహా యార్కర్లు వేయగల సామర్థ్యాన్ని ఆ జట్టుతో ఉన్నప్పుడే నేర్చుకున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
"నాకు యార్కర్లు వేయగల సామర్థ్యం ఉంది. కానీ, క్రమంగా దాన్ని కోల్పోయా. ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టులో ఆడే సమయంలో మొదటి, చివరి ఓవర్లను నాతో బౌలింగ్ చేయించేవారు. 2014లో 14 మ్యాచ్‌ల అనుభవంతో ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్చుకున్నా. అదే నా కెరీర్‌కు మలుపు. ప్రత్యేకంగా డెత్ ఓవర్లలో ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో అవగాహన చేసుకున్నా. ధోనీలాగా నేను ఫలితం గురించి ఆలోచించకుండా కెరీర్‌పై దృష్టి సారించా. దీంతో చివరికి అవే ఫలితాన్ని పొందడంలో సహాయపడ్డాయి".
- భువనేశ్వర్ కుమార్, టీమ్ఇండియా పేసర్
లాక్డౌన్ విరామంలో ఆటకు దూరంగా ఉంటూ తనలో తాను ప్రేరణ పొందటం చాలా కష్టమని పేర్కొన్నాడు భువనేశ్వర్. "లాక్డౌన్లో మొదటి 15 రోజులు నాలో నేను మరింత ప్రేరణ పొందా. కానీ, అది ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవరికీ తెలియదు. ఇంట్లో వ్యాయామం చేయడానికి నా దగ్గర పరికరాలూ లేవు. ఆ 15 రోజుల తర్వాత నాలో నేను స్ఫూర్తి పొందడం కొంచెం కష్టంగా అనిపించింది. అప్పుడే వ్యాయామ పరికరాలను తెప్పించుకుని ఇంట్లోనే వర్కౌట్లు చేయడం మొదలుపెట్టా. ఈ విరామం తర్వాత నన్ను సరికొత్త రీతిలో చూస్తారు. మైదానంతో పోలిస్తే ఇంట్లో వ్యాయామాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ, నేను ఫిట్‌గా ఉంటూ నాలో ప్రతిభను మరింత పెంచుకుంటున్నా" అని తెలిపాడు.