యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ ప్రదర్శన చూసి క్రికెట్ విశ్లేషకుల నుంచి సగటు ప్రేక్షకుడి వరకు ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. అయితే దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. తనకు విరాట్ కోహ్లీ ఆటతీరే నచ్చుతుందని, తాను చూసిన వాటిలో స్మిత్ శతకాలు అత్యంత చెత్తవని తెలిపాడు.
కోహ్లీతో పోలిస్తే స్మిత్ టెక్నిక్, ఆట తీరు విభిన్నంగా ఉంటుందని, అతడు శతకాలు చేసినప్పటికీ చూసేందుకు అంత క్లాస్‌గా ఉండవని అభిప్రాయపడ్డాడు జాంటీ.
"క్రికెట్ చూసే వారు ఎవరైనా.. 'వావ్ అద్భుతమైన షాట్ ఇది? ఏమి ఆడాడు..' అని మెచ్చుకునేలా ఉండాలి. ఆ రకంగా చూస్తే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలి నాకు నచ్చుతుంది. అతడి ఆటను ఎంజాయ్ చేస్తా. స్మిత్ పరుగులు చేస్తూనే ఉన్నాడు.. కానీ నేను చూసిన వాటిలో అతడి శతకాలు అత్యంత చెత్తవి" - జాంటీ రోడ్స్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.
బాల్ ట్యాంపరింగ్‌తో ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్న స్మిత్.. యాషెస్ ద్వారా టెస్టుల్లో పునరాగామనం చేశాడు. ఈ సిరీస్‌లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 110.57 సగటుతో 774 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, మూడు అర్ధశతకాలు ఉన్నాయి. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మినహా ప్రతి మ్యాచ్‌లో కనీసం 50 పరుగులు చేశాడీ ఆసీస్ ప్లేయర్. అతడి ప్రదర్శనతో యాషెస్ టైటిల్‌ను మళ్లీ తమ వద్దే ఉంచుకోగలిగింది కంగారూ జట్టు.
ఇదీ చదవండి: ఒలింపిక్స్ బెర్త్ పక్కా.. కాంస్యానికి అడుగుదూరంలో