2018-19లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా సత్తా చాటింది. కంగారూల గడ్డపై టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది కూడా ఆసీస్‌పైనా ఆధిపత్యం చెలాయించడానికి కోహ్లీసేన సన్నద్ధమవుతోంది. ఆసీస్‌తో భారత్ చివరిసారిగా ఆడిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో.. విరాట్ కోహ్లీ, యుజ్వేంద్ర చాహల్ సహా పలువురు యువ క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అయితే ఆస్ట్రేలియాతో ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో.. భారత జట్లు ఆటగాళ్లు సాధించగల రికార్డులేవో చూద్దాం..
బ్యాటింగ్‌లో రికార్డులు
- ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్. ఆ తర్వాత స్థానంలో కోహ్లీ ఉన్నాడు. కంగారూలపై విరాట్ ఇప్పటివరకు 8 శతకాలను నమోదు చేశాడు. ఈ నెలాఖరున జరగనున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ మరో 2 సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. దీంతో పాటు ఒకే జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగానూ విరాట్ నిలుస్తాడు.
- అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 70 సెంచరీలతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ వన్డే సిరీస్‌లో మరో రెండు శతకాలు నమోదు చేస్తే.. రికీ పాంటింగ్‌ను అధిగమిస్తాడు.
- ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ మూడు సెంచరీలు సాధిస్తే.. అన్ని ఫార్మట్లలో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. సచిన్.. ఆస్ట్రేలియాపై 20, శ్రీలంకపై 17 సెంచరీలు చేసి ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డాన్ బ్రాడ్‌మన్ ఇంగ్లాండ్‌పై 19 శతకాలను నమోదు చేశాడు. ఆసీస్‌పై అన్ని ఫార్మట్లలో కలిపి కోహ్లీ 15 సెంచరీలు చేశాడు.
- వన్డే క్రికెట్లో వేయి పరుగుల మైలురాయిని చేరుకోవడానికి హార్దిక్ పాండ్య మరో 43 పరుగులు చేయాల్సి ఉంది. వన్డేల్లో 54 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్.. 29.91 సగటున 957 పరుగులను నమోదు చేశాడు.
- ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ మరో 43 పరుగులు నమోదు చేస్తే.. వన్డేల్లో ఆసీస్ జట్టుపై అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను అధిగమిస్తాడు. కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 40 మ్యాచ్‌ల్లో 1910 స్కోరు నమోదు చేశాడు. 3077 రన్స్‌తో ఈ జాబితాలో సచిన్ తెందూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
- ఆస్ట్రేలియాపై 2 వేల పరుగులు నమోదు చేయడానికి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో 90 రన్స్ చేయాల్సి ఉంది. ఇలా చేస్తే ఆ జట్టుపై రెండు వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఐదో స్థానానికి చేరుతాడు.
- వన్డే క్రికెట్లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీ మరో 133 రన్స్ చేయాల్సిఉంది. దీంతో అతి తక్కువ సమయంలోనే వేగంగా ఈ ఘనతను సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. 12 వేల పరుగులను చేరుకోవడానికి సచిన్ 300 ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతానికి సచిన్ ఇందులో అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 239 ఇన్నింగ్స్ మాత్రమే ఆడటం విశేషం.
- వన్డేల్లో వేయి పరుగులను చేరడానికి టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ మరో 252 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. తర్వాతి రెండు ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకుంటే.. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మరో ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలుస్తాడు.
- వన్డే క్రికెట్లో 1500 పరుగుల మైలురాయిని చేరడానికి కేఎల్ రాహుల్ మరో 261 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ఈ ఆస్ట్రేలియా సిరీస్‌లోనే ఈ మైలురాయిని చేరుకుంటే.. కోహ్లీ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.
- వన్డేల్లో 6 వేల పరుగులను నమోదు చేయడానికి ఓపెనర్ శిఖర్ ధావన్ మరో 312 రన్స్ చేయాలి. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో ఈ మైలురాయిని చేరుకుంటే.. అత్యధిక వేగంగా 6 వేల పరుగులకు చేరిన ఆటగాళ్ల జాబితాలో హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఫీట్ సాధిస్తాడు.
బౌలింగ్‌లో రికార్డులు
- వన్డే చరిత్రలో టీమ్ఇండియా మాజీ బౌలర్ అజిత్ అగార్కర్.. 12 సందర్భాల్లో నాలుగు వికెట్లు ఒకసారి సాధించాడు. పేసర్ మహ్మద్ షమి ఇప్పటివరకు అలా 10 సందర్భాల్లో సాధించాడు. మరో రెండు సార్లు నాలుగు వికెట్లను పడగొడితే అగార్కర్ రికార్డును షమి సమం చేస్తాడు.
- టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. తన పేరు మీద 21 స్టంపింగ్స్ చేశాడు. మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సచిన్ తెందూల్కర్‌లు 22 స్టంపింగ్స్ చేశారు. జడేజా మరో రెండు స్టంపింగ్స్ సాధిస్తే వీరిద్దరిని అధిగమిస్తాడు.
- వన్డేల్లో 150 వికెట్లు చేరాలంటే మహ్మద్ షమి మరో 6 వికెట్లు సాధించాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో 6 వికెట్లు పడగొడితే.. వేగంగా ఈ మైలురాయిని చేరిన బౌలర్‌గా మూడోస్థానంలో చేరడం సహా ట్రెంట్ బౌల్ట్‌ను అధిగమిస్తాడు.
- వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి యుజ్వేంద్ర చాహల్ మరో 9 వికెట్లను పడగొట్టాల్సి ఉంది. ఆసీస్‌తో జరిగే సిరీస్‌లో ఇలా చేస్తే.. మహ్మద్ షమిని అధిగమించడం సహా అత్యధిక వేగంగా వంద వికెట్లు సాధించిన భారతీయ బౌలర్‌గా నిలుస్తాడు.
- రవీంద్ర జడేజా తాను ఆడిన 165 వన్డేల్లో 187 వికెట్లను సాధించాడు. మరో 13 వికెట్లు పడగొడితే 200 మైలురాయికి చేరుతాడు.