ఈ ఏడాది ఐపీఎల్లో పాల్గొనలేకపోతున్నందుకు ఎటువంటి బాధ లేదని ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ తెలిపాడు. వచ్చే వేసవి సీజన్‌కు ప్రస్తుతం అన్ని విధాలుగా సంసిద్ధం అవుతున్నట్లు వివరించాడు. ఇటీవలే కరోనా కారణంగా వాయిదా పడిన టీ20 ప్రపంచకప్‌పై దృష్టి కేంద్రీకరించేందుకు స్టార్క్ ఈ లీగ్ నుంచి తప్పుకున్నాడు.

"నాకు తెలుసు. ఐపీఎల్ ఎంతో అద్భుతమైంది,. కానీ నా నిర్ణయాన్ని మార్చుకోను. ఓ వైపు సెప్టెంబరులో ఐపీఎల్ జరుగుతుంటే.. ఆ సమయాన్ని శిక్షణకు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉంది. వచ్చే ఏడాదిలో జరిగే లీగ్‌లో ప్రజలు నన్ను కోరుకుంటే.. కచ్చితంగా ఆ విషయం గురించి ఆలోచిస్తా. కానీ, ఇప్పుడు మాత్రం నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు."
-మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియా బౌలర్
2018 ఐపీఎల్ వేలంలో మిచెల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఎన్ఎస్డబ్ల్యూ స్టేట్ జట్టుతో శిక్షణ పొందుతున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌పై కూడా స్పందించాడు మిచెల్. "ఆటగాళ్లందరూ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మేము ఇంగ్లాండ్‌కు వెళ్తామా లేదా అనే విషయం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ప్రభుత్వం కలిసి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. క్రికెటర్లంతా ఈ సిరీస్ కోసం వేచి చేస్తున్నారు" అని స్టార్క్ పేర్కొన్నాడు.

మూడు టీ20, వన్డేలతో కూడిన ఈ సిరీస్ సెప్టెంబరు 4న ప్రారంభం కానుంది. అయితే ఇందుకు అనుమతి ఇంకా లభించలేదు.