పురుష, మహిళా క్రికెటర్ల చెల్లింపుల్లో అంతరం గురించి స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన అభిప్రాయం వ్యక్తం చేసింది. పురుషుల క్రికెట్ నుంచే ఆదాయం వస్తుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలని సూచించింది. మహిళల క్రికెట్ నుంచి కూడా ఆదాయం రావడం మొదలైన రోజున పురుషులతో సమానంగా చెల్లించాలని అడిగేవాళ్లలో తాను ముందుంటా అని చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం అలా అడగలేమని స్మృతి తెలిపింది.
"మా జట్టులో ఎవరూ కూడా ఈ అంతరం గురించి ఆలోచిస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మా దృష్టంతా దేశం తరఫున మ్యాచ్‌లు గెలవడం, స్టేడియాలకు జనాలను రప్పించడం ద్వారా ఆదాయం రాబట్టడంపైనే. మా క్రికెట్ నుంచి ఆదాయం రావాలంటే మేం బాగా ఆడాలి. పురుషులలాగే మాకూ చెల్లించాలని మేం అడగడం సమంజసం కాదు."
- స్మృతి మంధాన, స్టార్ క్రికెటర్
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో అత్యున్నత విభాగంలో ఉన్న పురుష క్రికెటర్లకు ఏడాదికి రూ.7 కోట్లు లభిస్తుండగా.. అదే మహిళల క్రికెట్లో టాప్ గ్రేడ్‌లో ఉన్న వారికి లభించే మొత్తం రూ.50 లక్షలు మాత్రమే అని స్మృతి వ్యాఖ్యానించింది.